కన్నడ రాజకీయంతో కేసీఆర్ కు భారీ షాక్

Wed May 16 2018 16:35:56 GMT+0530 (IST)

కర్ణాటకలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకుల మీద షాకులుగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లటం.. దేవెగౌడతో సమావేశం కావటం తెలిసిందే. తన ఫెడరల్ ఫ్రంట్ గురించి దేవెగౌడతో చర్చించిన కేసీఆర్.. అప్పట్లో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా తెలుగువారంతా జేడీఎస్ కు ఓటు వేయాలని కోరారు.తన ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్.. బీజేపీలకు ప్రత్నామ్నాయమని.. గడిచిన 70 ఏళ్లల్లో ఈ రెండు జాతీయ పార్టీలతో దేశానికి ఎలాంటి ప్రయోజనం వాటిల్లలేదని ఈ మధ్యన విరుచుకుపడటం తెలిసిందే. తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ లో బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలకు చోటు లేదంటూ కేసీఆర్ అదే పనిగా స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫెడరల్  ప్రంట్ స్ఫూర్తికి దెబ్బ పడేలా తాజాగా దేవెగౌడ అండ్ కో అడుగులు వేసి.. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపటం కేసీఆర్ కు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు.  

దేవెగౌడ.. కుమారస్వామిల వ్యవహారం ఇలా ఉంటే.. కర్ణాటక ఫలితం నేపథ్యంలో దేశంలోని బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వటం కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కలలు కల్లలు అయ్యేలా మారాయని చెప్పక తప్పదు. ఒకరి తర్వాత ఒకరుగా.. కేసీఆర్  భేటీ అయిన వారంతా ఇప్పుడు బీజేపీ యేతర పక్షంగా ఏర్పడాలన్న సూచన చేయటం.. లేదంటే కలిసి పోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.