Begin typing your search above and press return to search.

కర్ణాటక సర్కారుకు షాకింగ్ గా పోలీసుల ‘సెలవు’లు

By:  Tupaki Desk   |   28 May 2016 10:58 AM GMT
కర్ణాటక సర్కారుకు షాకింగ్ గా పోలీసుల ‘సెలవు’లు
X
కొన్ని యాక్షన్ సినిమాల్లో అరుదుగా కనిపించే సీన్ ఒకటి రియల్ లైఫ్ లో దర్శనం ఇవ్వనుంది. ఉన్నతాధికారుల వేధింపులకు నిరసనగా వేలాది మంది పోలీసులు నిరసన తెలపాలని డిసైడ్ అయ్యారు. అయితే.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసులు నిరసన తెలపటమా అన్న సందేహం కలగొచ్చు. అలాంటిది సాధ్యమేనని చెబుతూ కర్ణాటక పోలీసులు ఒక భారీ డెసిషన్ తీసుకున్నారు.

జూన్ 4న కర్ణాటకకు చెందిన 50వేల మంది పోలీసులు సామూహికంగా సెలవు పెట్టాలని నిర్ణయించారు. దశాబ్దాల తరబడి తమ సమస్యల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. రోజుకు 15 గంటల పాటు పని చేసినా వేధింపులు తప్పటం లేదన్న ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్న పోలీసులు జూన్ 4న సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వారికి ఆ రోజు సెలవులు ఇచ్చేది లేదంటూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారట.

ఈ ఆందోళనకు అఖిల కర్ణాటక పోలీసు మహాసంఘం నేతృత్వం వహిస్తుండటంతో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది. పరిస్థితి చేయి దాటే వరకూ వేచి చూసే కన్నా.. పోలీసుల డిమాండ్ల మీద కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. దేశంలో ఇప్పటివరకూ ఎప్పడూ ఎదురుకాని ఒక వినూత్న నిరసనకు కర్ణాటక రాష్ట్రం వేదిక అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఇష్యూ మీద సిద్ధరామయ్య సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.