Begin typing your search above and press return to search.

శ్రీ‌నివాస‌పురం 'బెబ్బులిపులి' గురించి తెలుసా?

By:  Tupaki Desk   |   9 April 2018 7:13 AM GMT
శ్రీ‌నివాస‌పురం బెబ్బులిపులి గురించి తెలుసా?
X
దేశంలో చాలా పార్టీలు ఉన్న‌ప్ప‌టికీ.. వృద్ధ కాంగ్రెస్ గురించి ప్ర‌స్తావించినా.. ఆ పార్టీకి చెందిన నేత‌ల‌కు సంబంధించి అంత ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌రు. ఎవ‌రైనా కాంగ్రెస్ నేత‌ల గురించి గొప్ప‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే చిరాగ్గా ముఖం పెట్టే వాళ్లు బోలెడంత‌మంది క‌నిపిస్తారు. బీజేపీతో స‌హా కొన్ని పార్టీల్లో కొంద‌రు నేత‌ల గురించి గొప్ప‌గా చెప్ప‌ట‌మే కాదు.. ఆయ‌నంత పోటుగాడు మ‌రెవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా ప్ర‌చారం చేస్తుంటారు.

అయితే.. ఇదే త‌ర‌హాలో కాంగ్రెస్ పార్టీలోనూ కొంద‌రు నేత‌లు ఉంటారు. కాంగ్రెస్ కు ఉండే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఫుణ్య‌మా అని ఎవ‌రిగురించైనా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే.. ఆ పార్టీకి అంత సీన్ లేద‌ని తేల్చేస్తుంటారు. కానీ.. అంద‌రూ ఒకేలా ఉండ‌ర‌న్న‌ట్లు కాంగ్రెస్ లోనూ కొంత మంది నేత‌ల గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సి ఉంది.

అలాంటి కోవ‌కే చెందుతారు క‌ర్ణాట‌క‌కు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌.. రాష్ట్ర మంత్రి కేఆర్ ర‌మేశ్ కుమార్‌. క‌ర్ణాట‌కలోని కోలారు జిల్లా శ్రీ‌నివాస‌పురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే గ‌డిచిన కొంత‌కాలంగా క‌ర్ణాట‌క వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న్ను అంద‌రూ శ్రీ‌నివాస‌పురం బెబ్బులి పులిగా అభివ‌ర్ణిస్తుంటారు.

ఇంత‌కీ ర‌మేశ్ గొప్ప‌త‌నం ఏమిటంటే.. ఇప్ప‌టికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌టం.. ఒక‌సారి స్పీక‌ర్ గా ప‌ని చేయ‌ట‌మే కాదు.. అసెంబ్లీలోని 224 మంది ఎమ్మెల్యేల‌ను పేర్లు పెట్టి పిల‌వ‌గ‌లిగిన స‌త్తా ఆయ‌న సొంతం. స‌భా వ్య‌వ‌హారాల మీద ప‌ట్టుతో పాటు.. పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తార‌న్న పేరుంది. మిగిలిన కాంగ్రెస్ నేత‌ల‌కు భిన్నంగా ఆయ‌న ఆర్భాటాల‌కు దూరంగా ఉంటారు.

ఎక్క‌డిదాకానో ఎందుకు ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఇలాంటివేళ‌.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం సిద్ద‌రామ‌య్య బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైతే.. ఒక్క‌టంటే ఒక్క ఫ్లెక్సీని మాత్ర‌మే ఏర్పాటు చేయించారు. త‌న నోటి మాట‌తో ల‌క్ష మందికి పైగా ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యేలా చేయ‌గ‌లిగారు. ఈ బెబ్బులిపులికి ఉన్న బ‌లాన్ని గుర్తించిన సీఎం సిద్ద‌రామ‌య్య ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

మంత్రిగా ప‌రైవేటు వైద్య విధానంలో తీసుకొచ్చిన మార్పుల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకున్న‌ట్లు చెబుతారు. 108 వాహ‌నాల‌పై సీఎం ఫోటోతో పాటు ప్ర‌భుత్వ లోగో మిన‌హా త‌న ఫోటోను పెట్టుకోవ‌టానికి ఆయ‌న అస్స‌లు ఇష్ట‌డ‌ప‌రు. ఆయ‌న‌కున్న ఇమేజ్ ఎలాంటిదంటే.. నాటి ఏపీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా ర‌మేశ్ కుమార్ కు ప్ర‌చారం చేయ‌టానికి తానే స్వ‌యంగా వ‌చ్చి ప్ర‌చారం చేశారు.

ఎన్నిక‌ల వేళ‌.. మంది మార్బ‌లాన్ని వెంటేసుకొని వెళ్ల‌కుండా తానొక్క‌డే స్వ‌యంగా వారిని ప‌రామ‌ర్శించ‌టం.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి పంచాయితీని.. ప్ర‌తి ప‌ల్లెను సంద‌ర్శించ‌టం.. ఈ సంద‌ర్భంగా తాను.. త‌న డ్రైవ‌ర్ మిన‌హా ఎవ‌రిని వెంట బెట్టుకోకుండా ప్ర‌చారం చేసుకోవ‌టం ఆయ‌న‌కే సాధ్య‌మేమో. ప్ర‌తి ఓట‌ర్ ను స్వ‌యంగా క‌లుసుకోవ‌టమే త‌న ల‌క్ష్యంగా చెప్పే ఆయ‌న‌.. అలా ఒంట‌రిగా క‌లిసిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ఉన్న నిజ‌మైన స‌మ‌స్య‌లు దృష్టికి వ‌స్తాయ‌ని చెబుతారు. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి కాంగ్రెస్ నేత మీకు ఎప్పుడైనా క‌నిపించారా?