Begin typing your search above and press return to search.

చెరువులో హెచ్.ఐ.వీ రోగి శవం.. నీళ్లు తరలింపు

By:  Tupaki Desk   |   6 Dec 2018 11:46 AM GMT
చెరువులో హెచ్.ఐ.వీ రోగి శవం.. నీళ్లు తరలింపు
X
సమాజంలో ఇంకా మూఢ జాఢ్యాలు ఉన్నాయనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ గా మిగిలింది. కర్ణాటకలోని హుబ్లీ జిల్లా మొరాబ్ గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఎయిడ్స్ వ్యాధి కారణంగా మనస్తాపం చెంది.. గ్రామానికి పక్కనే దాదాపు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉండే పెద్ద చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె చెరువు లో దూకి మునిగిపోయినప్పుడు ఎవరూ గుర్తించలేదు.. నాలుగైదు రోజుల తర్వాత ఆమె శవం నీటి పై తేలింది. చెరువులోని చేపలు ఆమె శరీరాన్ని కొంత మేర తినేశాయి. దీంతో హెచ్.ఐ. వీ కారక మహిళ రక్తం చెరువులో కలిసి మొత్తం చెరువు పాడైపోయిందని గ్రామస్థులు భయపడ్డారు.

ఆ చెరువు నీరును గ్రామస్థులు ఇన్నాళ్లు తాగేవారు. మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్నాక తాగడం మాని చెరువు నీరును పూర్తిగా తోడేయాలని నిర్ణయించారు. ఇందు కోసం చెరువు చుట్టూ భారీగా పైపు లైన్ల ను, మోటార్ల ను పెట్టారు. నాలుగు రోజులు గా 36 ఎకరాల్లోని నీటిని తోడేస్తున్నారు.

గ్రామానికి ప్రాణాధారమైన నీరును ఖాళీ చేస్తుండడంతో ఊరికి నీటి కొరత దాపురించింది. కానీ మహిళ చనిపోవడంతో తమకూ ఆ వ్యాధి వస్తుందని అంత పెద్ద చెరువులోని నీటిని గ్రామస్థులంతా ఖాళీ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది.