Begin typing your search above and press return to search.

ఇదే.. క‌ర్ణాట‌క ఫైన‌ల్ ఫిగ‌ర్స్!

By:  Tupaki Desk   |   15 May 2018 10:34 AM GMT
ఇదే.. క‌ర్ణాట‌క ఫైన‌ల్ ఫిగ‌ర్స్!
X
ఇటీవ‌ల కాలంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చోటు చేసుకోన‌న్ని మ‌లుపులు క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్నాయ‌ని చెప్పాలి. ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా ఇన్నేసి నాట‌కీయ మ‌లుపులు ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకోలేదని చెప్పాలి. అధికార‌.. విప‌క్ష పార్టీల‌ను అధికారం దోబూచులాడేలా చేయ‌టం.. ఆశ‌లు క‌ల్పించ‌టం.. అంత‌లోనే నిరాశ‌కు గురి చేయ‌టం.. ఇలా ఎన్ని మ‌లుపులు ఉండాలో అన్ని మ‌లుపులు క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌నిపించాయని చెప్పాలి.

ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిన అర గంట‌కే కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన మెజార్టీ దిశ‌గా ప‌రుగులు పెడుతున్న‌ట్లుగా గ‌ణాంకాలు వెలువ‌డ్డాయి. నిజ‌మా అనుకునేంత‌లో బీజేపీ అధిక్య‌త మొద‌లైంది. అది అంత‌కంత‌కూ పెరిగి.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యానికి పీక్స్ కు చేరుకుంది. బీజేపీకి 115 సీట్ల‌లో అధిక్య‌త ఖాయ‌మ‌న్న‌ట్లుగా ఆ పార్టీ నేత‌లు భావించారు. సుడి తిరిగితే మ‌రో రెండు.. మూడు సీట్లు పెరిగే అవ‌కాశం ఉంద‌న్న భావన వ్య‌క్త‌మైంది. అంతే.. క‌మ‌ల‌నాథుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.

వీధుల్లోకి వ‌చ్చిన క‌మ‌ల‌నాథులు సంబ‌రాల మీద సంబ‌రాలు చేసుకునే ప‌రిస్థితి. ఇది ఒక్క క‌ర్ణాట‌క‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా బీజేపీ నేత‌లకు క‌ర్ణాట‌క ఫ‌లితం కిక్కు ఎక్కేలా చేసింది. మ‌రోవైపు కాంగ్రెస్ దిగాలు ప‌డిపోయింది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఇంటి ముందు వాతావ‌ర‌ణం నిర్మానుష్యంగా మారింది. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేని ప‌రిస్థితి. ఇక‌.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి అయితే.. ఏకంగా తాళం వేసేశారు.

ప‌న్నెండు నుంచి ఒంటి గంట‌.. ఆ త‌ర్వాత మ‌రో గంట‌కు ప‌రిస్థితి మారిపోయింది. 115 సీట్ల‌లో గెలుపు ప‌క్కా.. క్లియ‌ర్ మెజార్టీ అన్న బ్రేకింగ్ ల‌తో పాటు.. మోడీ డ్యాన్సులు వేస్తున్న‌ట్లుగా.. రాహుల్ ఏడుస్తున్న‌ట్లుగా కార్టూన్ బొమ్మ‌ల‌తో సంద‌డి చేసిన ఛాన‌ళ్లు త‌మ టీవీ స్క్రీన్ల‌ను మార్చేశాయి. అప్ప‌టివ‌ర‌కూ బీజేపీ క్లియ‌ర్ మెజార్టీ అంటూ సిద్ధం చేసిన లెక్క‌ల్ని ప‌క్క‌న పెట్టి.. హంగ్ లోకి వెళ్లిపోయారు. ఈ మార్పును బీజేపీ నేత‌లు గుర్తించి.. సంబ‌రాల్ని కాస్త త‌గ్గించేస‌రికి ఢిల్లీ నుంచి మొద‌లు కావాల్సిన రాయ‌బారాలు మొద‌ల‌య్యాయి.

త‌మ‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం లేని నేప‌థ్యంలో.. జేడీఎస్ ఓకే అంటే తాము కుమార‌స్వామికి సీఎం ప‌గ్గాలు అప్ప‌జెబుతామ‌ని.. ఆయ‌న‌కు అన్ కండీష‌న‌ల్ గా మ‌ద్ద‌తు ఇస్తామంటూ సోనియాగాంధీనే నేరుగా సీన్లోకి వ‌చ్చేసి దేవెగౌడకు మాట ఇచ్చేయ‌టం.. ఆ విష‌యాన్ని కుమార‌స్వామి అండ్ కో ఓకే అనేయ‌టం జ‌రిగిపోయాయి. జ‌రుగుతున్న ప‌రిణామాల్ని గ‌మ‌నించే లోపే జేడీఎస్ తో కాంగ్రెస్ రాజ్యాధికారానికి సంబంధించిన ఒప్పందం చేసేసుకోవ‌టం బీజేపీకి షాకింగ్ గా మారింది.

కాంగ్రెస్ ప్లాన్ కు విరుగుడు ఉంటుంద‌ని బీజేపీ నేత‌లు చెప్పినా.. ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. సీన్లోకి వ‌చ్చిన సీఎం సిద్ధ‌రామ‌య్య జేడీఎస్ కు కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని చెప్ప‌గా.. పొత్తు క్ర‌మాన్ని అజాద్ సైతం క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఇదిలా ఉండ‌గా.. కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న‌కు దేవెగౌడ దూర‌దృష్టితో ష‌ర‌తు విధించారు. కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌ను చెప్పారు అంతేకాదు.. మంత్రి ప‌ద‌వులు కాంగ్రెస్‌ కు కాస్త ఎక్కువ‌గా.. ముఖ్య‌మంత్రితో పాటు.. కొన్ని ప‌ద‌వులు జేడీఎస్ తీసుకునేలా ఒక ఫార్ములాను దేవెగౌడ ప్ర‌తిపాదించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

చూస్తున్నంత‌లో క‌న్న‌డ పీఠం చేజారిపోతున్న వైనానికి షాక్ తిన్న బీజేపీ అధినాయ‌క‌త్వం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు స్టార్ట్ చేసింది. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జ‌వ‌దేక‌ర్ తో పాటు న‌డ్డాను బెంగ‌ళూరు పంపింది. వారు బెంగ‌ళూరుకు వ‌చ్చి జేడీఎస్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతారా? లేక‌.. జేడీఎస్ ను చీల్చేలా ప్ర‌య‌త్నాలు షురూ చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలాఉంటే.. ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు సిద్ద‌రామ‌య్య రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామాను గ‌వ‌ర్న‌ర్ కు ఇచ్చేయ‌నున్నారు. ఆ వెంట‌నే.. జేడీఎస్.. కాంగ్రెస్ లు త‌మ బ‌లాన్ని గ‌వ‌ర్న‌ర్ కు చూపించి.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి తీసుకునే ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఇక‌.. ఫైన‌ల్ క‌ర్ణాట‌క లో ఆయా పార్టీల‌కు వ‌చ్చిన సీట్లు చూస్తే..

బీజేపీ 104
కాంగ్రెస్ 78
జేడీఎస్ 38
ఇత‌రులు 2

మొత్తం 224 సీట్లు కాగా.. 222 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.