Begin typing your search above and press return to search.

కోవింద్‌కు.. వినతుల్లాంటి ఒత్తిళ్లు షురూ!

By:  Tupaki Desk   |   25 July 2017 5:57 PM GMT
కోవింద్‌కు.. వినతుల్లాంటి ఒత్తిళ్లు షురూ!
X
భారతదేశపు 14వ రాష్ట్రపతిగా రాంనాధ్ కోవింద్ తన సింహాసనం మీద ఇంకా సర్దుకుని కూర్చున్నారో లేదో.. అప్పుడే ఆయనకు చికాకులు మొదలవుతున్నట్లుగా కనిపిస్తోంది. పైకి వినతుల రూపంలో కనిపించే ఒత్తిళ్లు ఆయన మీద, పదవికంటె ముందే పనిచేయడం ప్రారంభించినట్లుగా ఉంది. ఎందుకంటే.. దేశంలోనే అత్యంత వివాదాస్పద న్యాయమూర్తుల్లో ఒకడిగా ఇటీవలి కాలంలో బాగా హైలైట్ అయిన కర్ణన్ ఇప్పుడు రాంనాధ్ కోవింద్ ను ఆశ్రయిస్తున్నాడు. సుప్రీం కోర్టు తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ ఆయన ఏకంగా రాష్ట్రపతికే అభ్యర్థన పెట్టుకున్నాడు. పదవిలోకి వచ్చిన తొలిరోజే.. ఇలాంటి పితలాటకం తగులుకోవడం తమాషా విషయమే.

ఇటీవలి పరిణామాల్లో కోల్ కత హైకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరుగా ఉన్న జస్టిస్ కర్ణన్ వ్యవహారం ఎంత వివాదాస్పదంగా మారిందో అందరికీ తెలుసు. ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద తీవ్రమైన , గర్హనీయమైన ఆరోపణలు చేశారు. తనే సుప్రీం కోర్టు న్యాయమూర్తులకే జైలు శిక్ష విధిస్తూ ఆయన ఓ తీర్పు చెప్పేశారు. వాటిని సీరియస్ గా తీసుకున్న సుప్రీం ఆయన విచారణకు ఆదేశిస్తే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుప్రీం ఆయన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి జైలు శిక్ష విధించింది. మే9 వ తేదీన ఆయనకు ఆరునెలల జైలు శిక్ష విదించగా, పారిపోయిన ఆయనను పోలీసులు జూన్ 20 న పట్టుకున్నారు. ఇప్పుడాయన కోల్ కత లోని ప్రెసిడెన్సీ కరెక్షన్ హోంలో శిక్ష అనుభవిస్తున్నారు. భారత న్యాయవ్యవస్థలోనే సుప్రీం తీర్పు ద్వారా జైలు శిక్ష అనుభవిస్తున్న మొదటి హైకోర్టు న్యాయమూర్తి కర్ణనే కావడం విశేషం.

ఇదంతా ఒక ఎత్తు కాగా, రాజ్యాంగంలోని 72వ ఆర్టికల్ ప్రకారం.. తన శిక్షను రద్దు చేయాల్సిందిగా కోరుతూ కర్ణన్ కొత్త రాష్ట్రపతి కోవింద్ కు నివేదించుకున్నారు. తన ప్రతినిది ద్వారా ఆయన దానిని రాష్ట్రపతికి పంపారు. తన మీద సుప్రీం కన్నెర్ర జేస్తే.. దళితుడిని గనుక.. తనని తప్పుపడుతున్నారని, అసమంజస వ్యాఖ్యలు చేసిన కర్ణన్... ఈ విజ్ఞప్తిని పట్టించుకోకపోతే గనుక.. ప్రథమపౌరుడు రాంనాధ్ కోవింద్ కూడా దళిత వ్యతిరేకి అనడానికి సాహసిస్తారో ఏమో?