Begin typing your search above and press return to search.

క‌మ‌లం జోరుకు క‌ర్ణాట‌క బ్రేకులు!

By:  Tupaki Desk   |   21 May 2018 5:11 AM GMT
క‌మ‌లం జోరుకు క‌ర్ణాట‌క బ్రేకులు!
X
క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు క‌మ‌ల‌నాథుల‌కు తీవ్రంగా వేధిస్తున్నాయి. మూడు రోజుల‌కే ప్ర‌భుత్వం ప‌త‌నం కావ‌టం రానున్న రోజుల్లో ఆ పార్టీకి భారీ డ్యామేజ్ కు గురి చేస్తుందా? దీని ప్ర‌భావం రానున్న నెల‌ల్లోజ‌రిగే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుందా? అన్న ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

బీజేపీకి తిరుగులేద‌ని.. మోడీషాలు దృష్టి పెడితే ఇక అంతే సంగ‌తుల‌న్నది నిజం కాద‌ని.. స‌రిగ్గా ప్లాన్ చేస్తే వారిని చిత్తు చేయ‌టం పెద్ద విష‌యం కాద‌న్న‌ది క‌ర్ణాట‌క ఫ‌లితం రుజువు చేసింద‌ని చెప్పాలి.

క‌ర్ణాట‌క‌లో క‌మ‌ల‌నాథుల‌కు త‌గిలిన ఎదురుదెబ్బ‌.. ఆ పార్టీ దూకుడుకు బ్రేకులు వేయ‌టంతో పాటు.. ఆ పార్టీ ప‌వ‌ర్లో లేని రాష్ట్రాల్లో పాగా వేసే విష‌యంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీకి ప‌ట్టున్న ప్రాంతాల్లో మ‌రింత బ‌ల‌ప‌డ‌టం.. పార్టీ లేని రాష్ట్రాల్లో అధికార దిశ‌గా చేసే ప్ర‌య‌త్నాల‌కు తాజా ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగా మార‌తాయ‌న‌టంలో సందేహం లేద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఉత్త‌రాది రాష్ట్రాల్లో పార్టీకి ఎదురు లేని రీతిలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని.. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ అంతంత మాత్రంగా ఉంటే.. ద‌క్షిణాదిలో మాత్రం పార్టీ ఖాతా తెర‌వ‌లేని స్థితిలో ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌ర్ణాట‌క‌లో ఎదురైన చేదు అనుభ‌వం దృష్ట్యా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే క‌మ‌ల‌నాథుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు.

ఈ ఏడాది చివ‌ర్లో బీజేపీకి భారీ అగ్నిప‌రీక్ష ఒక‌టి రెఢీగా ఉంది. ప్ర‌స్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజ‌స్తాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికార‌ప‌క్షానికి ఎప్పుడూ ఉండే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త బీజేపీ ప్ర‌భుత్వాల్ని వేధిస్తోంది. దీనికి తోడు రాజ‌స్తాన్ ప్ర‌భుత్వంపై తీవ్ర అసంతృప్తి నెల‌కొని ఉంది. ఈసారి ఆ రాష్ట్రంలో బీజేపీకి ఎదురుదెబ్బ త‌గ‌ల‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

ఇది స‌రిపోద‌న్న‌ట్లు వ‌రుస విజ‌యాలు సాధించిన ఛ‌త్తీస్ గ‌ఢ్‌ లోనూ బీజేపీకి ఎదురుగాలి వీస్తుంద‌ని చెబుతున్నారు. ఇక‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోనూ క‌మ‌ల‌నాథుల ప‌రిస్థితి అంత‌గా బాగోలేద‌ని.. ఇక్క‌డ కూడా సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. ఒక‌వేళ ఇదే అంచ‌నాలు నిజ‌మైతే బీజేపీకి భారీ ఎదురుదెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

క‌ర్ణాట‌క ప‌రిణామాల పుణ్య‌మా అని.. బీజేపీని వ్య‌తిరేకించే పార్టీలు ఏక‌మైతే.. మోడీషాల‌కు భారీ షాకివ్వ‌టం పెద్ద విష‌యం కాద‌న్న‌ది రాజ‌కీయ ప‌క్షాల‌కు ఇప్పుడు బాగానే అర్థ‌మైంది. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నోట రావ‌టం గ‌మ‌నార్హం. బీజేపీని ఓడించేందుకుప్ర‌తిపక్షాలుఏక‌మైనందుకు తాను గ‌ర్విస్తున్నాన‌ని.. ఈ దేశంలో అహంకారానికి ఒక హ‌ద్దు ఉంటుంద‌న్న రాహుల్‌.. బీజేపీ.. సంఘ్ ప‌రివార్ లు క‌ర్ణాట‌క ఓట‌మి నుంచైనా ఆ విష‌యాన్ని గుర్తించాల‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలతో తాము ప‌వ‌ర్లో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని మ‌రింత బ‌ల‌ప‌ర్చుకునే ప‌నిలో బీజేపీ ఉంటుంద‌ని.. కొత్త రాష్ట్రాల‌కు విస్త‌రించాల‌న్న ఆలోచ‌న‌ను కొంత‌కాలం వాయిదా వేసుకునే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు.