అవును.. కేజ్రీవాల్ కు రూ.2కోట్లు ఇచ్చా

Fri May 19 2017 11:43:15 GMT+0530 (IST)

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఆయన రూ.2కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణ మీద ఒకప్పటి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన కపిల్ మిశ్రా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒక పారిశ్రామికవేత్త కేజ్రీవాల్ కు రూ.2కోట్ల మొత్తాన్ని లంచంగా ఇస్తున్నప్పుడు తాను చూసినట్లుగా చెప్పటమే కాదు.. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలంటూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాను చేస్తున్న ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించకపోవటాన్ని నిరసిస్తూ.. కపిల్ మిశ్రా నిరాహారదీక్ష చేశారు కూడా. కేజ్రీవాల్ రూ.2కోట్ల లంచం తీసుకున్నారన్న దానికి తన దగ్గర ఆధారాలు ఉన్నట్లుగా ఆయన చెప్పటం తెలిసిందే. డొల్ల కంపెనీల పేరుతో లంచం తీసుకుంటున్నారని.. కేజ్రీవాల్ సన్నిహితులు.. స్నేహితులు పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు తెరిచి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ కు తాను రూ.2కోట్ల మొత్తాన్ని ఇచ్చిన మాట వాస్తవమేనని వెల్లడించారు ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త శర్మ. అయితే.. తాను లంచం రూపంలో ఆ మొత్తాన్ని ఇవ్వలేదని.. పార్టీకి విరాళంగా మాత్రమే ఇచ్చినట్లుగా ప్రకటించారు. 2014 మార్చి 31న డీడీ రూపంలో ఆ మొత్తాన్ని తాను ఇచ్చానని.. ఆ విషయం కపిల్ మిశ్రాతో పాటు ఆప్ పార్టీకి చెందిన కీలక నేతలందరికి తెలుసన్నారు. కపిల్ మిశ్రా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కపిల్ మిశ్రా చెప్పినట్లుగా రూ.2 కోట్ల మొత్తం అయితే కేజ్రీవాల్ చేతికి వచ్చిన విషయం నిజమని తేలింది. అయితే.. అది లంచం రూపంలోనా? లేక.. విరాళం రూపంలోనా? అన్నది తేలాల్సి ఉంది. అయినా.. ఒక పార్టీకి ఒక పారిశ్రామికవేత్త రూ.2కోట్ల భారీ మొత్తాన్ని విరాళం రూపంలో ఇవ్వటంలో మర్మమేందంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/