Begin typing your search above and press return to search.

చంద్రబాబు ముంగిట మూడో ప్రశ్నాపత్రం

By:  Tupaki Desk   |   18 July 2018 5:04 PM GMT
చంద్రబాబు ముంగిట మూడో ప్రశ్నాపత్రం
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పు పడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా 5 ప్రశ్నలు సంధించారు. ఇప్పటివరకు రెండు వారాలుగా 10 ప్రశ్నలు సంధించిన కన్నా - తాజాగా మూడో వారం కూడా ప్రశ్నలు సంధించారు. తాను సంధించే ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పగలరా? అంటూ సవాల్ చేశారు.

1. సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి తీసుకుని - వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా దారుణంగా వంచించి - స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మెజారిటీ వాటా (58%) సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడం లేదా? రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్దమా?

2. మీరు అధికారంలోకి వచ్చే సమయానికి రూ.లక్ష కోట్లు ఉన్న రాష్ట్ర రుణ భారం - ఇప్పుడు ఏకంగా రూ. 2.35 లక్షల కోట్లకు ఎందుకు పెరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వగలరా? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి - రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్న మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా?

3. గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోవడానికి మీ ప్రచార పిచ్చి కారణం కాదా? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఐ.పోలవరంలో అమాయాక విద్యార్ధులు చనిపోవడం నిజం కాదా? మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు భాద్యత వహించాల్సిన అవసరం లేదా?

4. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి - అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానం చేయించింది మీరు కాదా? ప్యాకేజీలో భాగంగా నిధులు తీసుకుంటూనే - ప్రత్యేక హోదా కావాలనడం దుర్మార్గం కాదా? ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసింది మీరు కాదా?

5. పారదర్శక పాలన అందిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే మీరు అత్యధిక సంఖ్యలో రహస్య జీఓలను జారీ చేసిన విషయం నిజం కాదా? అసలు రహస్య జీఓలను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ అవినీతి కోసం కాదా?

...కాగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడైన తరువాత సంధిస్తున్న ఈ ప్రశ్నల పరంపరకు చంద్రబాబు నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఇంతవరకు సమాధానాల్లేవు. అయినా.. కన్నా మాత్రం పట్టు విడవకుండా ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.