Begin typing your search above and press return to search.

సీనియర్లను పట్టించుకోవా 'కన్నా'...?!

By:  Tupaki Desk   |   19 July 2018 7:59 AM GMT
సీనియర్లను పట్టించుకోవా కన్నా...?!
X
కన్నా లక్ష్మీ నారాయణ. ఆంధ్రప్రదేశ్ బిజెపి కొత్త అధ్యక్షుడు. నరనరానా కాంగ్రెస్ భావాలను - పనితీరును వంట పట్టించుకున్న నాయకుడు. భారతీయ జనతా పార్టీ దిద్దుబాటు చర్యలలో భాగంగా ఈ కొత్త "కాపు" పార్టీ అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ పటిష్టత కోసం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ సగం జిల్లాలను చుట్టేసారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కావడం సహించ లేని పార్టీ సినీయర్ నాయకులు ఆయనకు సహకరించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ కన్నా లక్ష్మీ నారాయణ కర్నూలు - కడప పర్యటనలే. ఆ రెండు జిల్లాలలోను కన్నా లక్ష్మీ నారాయణ పర్యటించినప్పుడు ఈ జిల్లాలకు చెందిన సీనియర్ నేతలెవ్వరూ రాలేదు.

కడప జిల్లాలో ఒంటిమిట్ట లో రామాలయాన్ని సందర్శించాలని, దైవ దర్శనం చేసుకోవాలని కన్నా లక్ష్మీ నారాయణ భావించారు. అయితే కడప జిల్లాకు చెందిన సీనియర్లు ఎవరూ అక్కడకు రాలేదు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ దైవదర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయారు. తాను అధ్యక్షుడు కావడం పార్టీ సీనియర్లకు ఇష్టం లేదని గ్రహించిన కన్నా లక్ష్మీ నారాయణ " తన మార్గంలో" వెళ్లడం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ - కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులలోను పని చేసిన కన్నా ఆయ‌న తన రాజకీయ చతురతను ప్రదర్శించడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత " కాపు "లను ఒక్కొక్కరినే పార్టీలోకి తీసుకు వచ్చే పనిలో పడ్డారు. ఈ వ్యూహం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా నచ్చడంతో ఆయన వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చెబుతున్నారు.

బిజేపిలో చాల కాలంగా ఉన్న సీనియర్ నాయకులతో పార్టీ పటిష్టం కావడం లేదని అధిష్టానం గుర్రుగా ఉంది. దీనిని ద్రుష్టిలో పెట్టుకునే పార్టీలో మార్పులు, చేర్పులు చేసారు. రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడును పార్టీ నుంచి తప్పించి ఉప రాష్ట్రపతిని చేసారు. ఇప్పుడు కన్నా లక్ష్మీ నారాయణను తెరపైకి తెచ్చి పార్టీలో పెత్తనం చెలాయిస్తున్న సీనియర్లకు చెక్ పెడుతున్నారు. ఈ వ్యూహం ఫలించి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పటిష్టమవుతుందో లేదో వేచి చూడాలి.