మోడీని కలిసి అసలు విషయం మరిచిన కన్నా

Wed Jun 13 2018 09:48:31 GMT+0530 (IST)

సీనియర్ రాజకీయవేత్త - మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అనూహ్య రీతిలో ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీని కలిసిన కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ పర్యటనలో తన విమర్శకులకు చాన్స్ ఇచ్చారా? స‌్వయంగా తానే ఎదురుదాడి చేసే చాన్స్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారిగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. ఈరోజు ఢిల్లీలో భేటీ అయిన కన్నా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు - పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు.అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీతో తొలిభేటీ ఫలవంతంగా జరిగిందన్నారు. ఏపీకి ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన 12 అంశాల జాబితాను ప్రధానికిచ్చినట్లుగా కన్నా తెలిపారు. త్వరలోనే మరోసారి పార్టీ నుంచి  ఓ ప్రతినిధి బృందం వచ్చి ప్రధానిని కలిసి ఈ అంశాలను త్వరిత గతిన అమలు చేయాలని కోరతామని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగానే ప్రధానికి ఇచ్చిన జాబితాను కన్నా మీడియాకు విడుదల చేశారు. ఈ జాబితాను గమనించగా ఆసక్తికర అంశం ఒకటి బయటపడింది. ఇందులో ప్రత్యేక హోదా అంశం లేదు!ఓవైపు ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని కోరుతూనే..కీలకమైన ప్రత్యేకహోదా అంశాన్ని ఈ జాబితాలో ప్రస్తావించకపోవడం ఆసక్తికరంగానే కాదు...ప్రత్యర్థులకు అస్త్రంగా కూడా మారింది. ప్రధానితో భేటీలో ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేక హోదా విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించలేదా?  లేకపోతే ఆయన మరిచిపోయి ఉండవచ్చా అంటూ పలువురు సందేహం లేవనెత్తుతున్నారు.

ఇదిలాఉండగా బుధవారం ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కన్నా లక్ష్మీనారాయణ భేటీ కానున్నారు . ఏపీకి చెందిన బీజేపీ నేతల బృందంతో కలిసి ఈ భేటీ ఉండనుంది. ఈ సందర్భంగా త్వరలో ఏపీలో అమిత్‌షా పర్యటనను ఖరారు చేసే అంశం కీలకంగా చర్చకు రానున్నట్లు సమాచారం. అయితే కీలకమైన ప్రత్యేక హోదా అంశం అమిత్‌షాతో చర్చల సందర్భంగా అయినా....ప్రస్తావనకు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.