Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ఆనం?..క‌న్నా స్నేహం ప‌నిచేస్తుందా?

By:  Tupaki Desk   |   11 Jun 2018 10:37 AM GMT
బీజేపీలోకి ఆనం?..క‌న్నా స్నేహం ప‌నిచేస్తుందా?
X
రాజ‌కీయ పార్టీల‌తో సంబంధం లేకుండా నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే... ఆనం ఫ్యామిలీకి చాలా పెద్ద పేరే ఉంద‌ని చెప్పాలి. ఆనం వివేకానంద‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిలు జిల్లా రాజ‌కీయాల‌ను త‌మ కంటి సైగ‌ల‌తో న‌డిపించారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న చాలా మంది రాజ‌కీయ నేత‌ల త‌ల‌రాత‌ను మార్చేసిన‌ట్టుగానే... ఆనం బ్ర‌ద‌ర్స్ ఫేట్ ను కూడా మార్చేసింద‌నే చెప్పాలి. తొలి నాళ్ల‌లో టీడీపీలోనే ఉన్న ఆనం బ్ర‌ద‌ర్స్‌... ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. అస‌లు ఆనం బ్రద‌ర్స్‌కు నేమ్ తో పాటు ఫేమ్ కూడా రావ‌డం కాంగ్రెస్ ద్వారానే జ‌రిగింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కొన‌సాగిన ఆనం బ్ర‌ద‌ర్స్‌... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేబినెట్ లో మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. వైఎస్ కేబినెట్ లో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా... ఆనం వివేకా జిల్లా రాజ‌కీయాల‌ను చూసుకున్నారు. ఇదంతా పాత క‌థే అయినా ఇప్పుడు వారి గురించిన ప్ర‌స్తావ‌న ఎందుకంటే... అనారోగ్య కార‌ణాల‌తో ఆనం వివేకా ఇటీవ‌లే మృతి చెందగా ఇప్పుడు రామ‌నారాయ‌ణ రెడ్డి ఒంట‌రివాడైపోయారు. అంతేకాకుండా త‌మ‌కు పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరినా వారికి ఒరిగిన ప్ర‌యోజ‌న‌మేమీ లేద‌ని తేలిపోయింది.

ఈ నేప‌థ్యంలో అన్న లేని త‌మ్ముడైన రామ‌నారాయ‌ణ రెడ్డి ప్ర‌త్యామ్నాయం కోసం చూస్తున్నారు. త‌మ ప్రియ‌త‌మ నేత అయిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీలో చేరేందుకు ఒకానొక స‌మ‌యంలో రామ‌నారాయ‌ణ రెడ్డి స‌రేన‌న్న‌ట్టుగానే వార్త‌లు వినిపించాయి. అటువైపు రామ‌నాయ‌ణ‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ కూడా స‌రేన‌న్న‌ట్లుగా వార్త‌లొచ్చాయి. అయితే ఆయ‌న వైసీపీలో చేరేలోగానే స‌మీక‌ర‌ణాలు మారిపోయిన‌ట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. నారాయ‌ణ రెడ్డి బీజేపీలో చేరే అవ‌కాశాలున్నాయ‌ని, ఇందుకు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌క‌డ్బందీగా పావులు క‌దుపుతున్న‌ట్లుగా వినికిడి. అయినా క‌న్నా ప్లాన్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.... ఆనంతో పాటు క‌న్నా కూడా సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగారు. ఆనం మాదిరే క‌న్నా కూడా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత బాగానే ఫేడ‌వుట‌య్యారు.

ఈ క్ర‌మంలో కొంత‌కాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన క‌న్నా... బీజేపీలో చేరి ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని సంపాదించారు. ఇక పూర్వాశ్ర‌మంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న స‌మ‌యంలో ఆనంతో పాటు క‌న్నా కూడా కేబినెట్ మంత్రిగా ప‌ని చేశారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. అంతేకాకుండా క‌న్నా కూడా వైసీపీలోకి చేరేందుకు అంతా సిద్ధ‌మైపోయిన స‌మ‌యంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పి... బీజేపీ అధిష్ఠానం క‌న్నాను నిలువ‌రించింది. ఇప్పుడు ఆనం వైసీపీలో చేరిక‌కు దాదాపుగా రంగం సిద్ధ‌మైన త‌రుణంలో ఆయ‌న‌ను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు క‌న్నా త‌న‌దైన శైలి పాచిక‌లు వేస్తున్నారు. మ‌రి క‌న్నా అందిస్తున్న స్నేహ హ‌స్తానికి త‌లొగ్గి ఆనం బీజేపీలో చేర‌తారా? లేదంటే ముందుగా అనుకున్న‌ట్లే వైసీపీలో చేర‌తారా? చూడాలి.