Begin typing your search above and press return to search.

ఆ నోటీసులు బాబు చేసుకున్న పుణ్య‌మేన‌ట‌

By:  Tupaki Desk   |   14 Sep 2018 1:54 PM GMT
ఆ నోటీసులు బాబు చేసుకున్న పుణ్య‌మేన‌ట‌
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జారీచేసిన నోటీసుల ఉదంతం మ‌లుపులు తిరుగుతోంది. 8 ఏళ్ల తర్వాత బాబ్లీ అంశం మళ్లీ తెరపైకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. బాబ్లీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో 16 మందిని ఈ నెల 21 లోపు కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీనిపై టీడీపీ శ్రేణులు స‌హ‌జంగానే భ‌గ్గుమంటున్నాయి. త‌మ‌దైన శైలిలో వ‌క్రీక‌ర‌ణ‌లు చేస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కుట్రలో భాగమేనని - చట్ట విరుద్దంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం చరిత్రలో లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఎంతో కఠినంగా వ్యవహరించినా వెనక్కు తగ్గలేదని బీరాలు ప‌లుకుతున్నారు. బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు. ఈ ఎపిసోడ్‌ పై తాజాగా బీజేపీ నేత‌లు స్పందిస్తున్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ - కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వ‌రి తాజాగా వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుకు నోటీసులు రావడంలో.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. పదహారు వాయిదాలకు హాజరు కానందునే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందని క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ తెలిపారు. ఈ నోటీసుల గురించి సినీనటుడు శివాజీకి ముందే ఎలా తెలుసో.. తమకు తెలియదన్నారు. శివాజీ చెబుతున్న ఆపరేషన్‌ గరుడకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కన్నా లక్ష్మినారాయణ వెల్ల‌డించారు. తానే సీనియ‌ర్ అని చెప్పుకునే చంద్ర‌బాబుకు కోర్టు నోటీసుల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.

బీజేపీ నేత పురందీశ్వ‌రి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని విమర్శించే వారిపై కేంద్రం ఈడీ - పోలీస్ కేసులు బనాయిస్తుందని టీడీపీ నేత‌ల‌ విమ‌ర్శ‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌న్నారు. చంద్రబాబుపై 2010లో కేసు నమోదైతే.. బీజేపీని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. ఏం జరిగినా టీడీపీ నేతలు కేంద్రానికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై అక్కడి ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌ల్లో నిజం లేద‌న్నారు. సాంకేతికపరమైన అంశాల వల్ల కొంత జాప్యం జరిగి ఉండవచ్చని పేర్కొంటూ పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దానిని తామే పూర్తి చేస్తామని వెల్లడించారు.కేసుల ప‌రంగా నిధుల ప‌రంగా కేంద్రం ఎలాంటి క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆమె వెల్ల‌డించారు.