Begin typing your search above and press return to search.

క‌దిరి లెక్క‌ల‌తో టీడీపీకి చిక్కులే!

By:  Tupaki Desk   |   23 Jan 2017 4:41 AM GMT
క‌దిరి లెక్క‌ల‌తో టీడీపీకి చిక్కులే!
X
అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌లే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఓ మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. మెజారిటీ ఎంపీటీసీలున్నా... టీడీపీ నెర‌పిన మంత్రాంగంతో ఎంపీపీ ప‌ద‌విని వైసీపీ కోల్పోయింది. ఇది టీడీపీకి కాస్తంత లాభించినా... క‌దిరి ఎమ్మెల్యే చాంద్ బాషా - నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంచార్జీ కందికుంట వెంక‌ట‌ప్ర‌సాద్‌ ల మ‌ధ్య కొన‌సాగుతున్న ఆధిప‌త్య పోరు అక్క‌డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చేస్తోంద‌నే చెప్పాలి. క‌దిరిలో దివంగ‌త నేత‌ - మాజీ మంత్రి ప‌రిటాల ర‌వికి పెట్ట‌ని కోట అనే చెప్పాలి. అయితే ర‌వి హ‌త్య అనంత‌రం అక్క‌డ టీడీపీకి ఎదురు గాలి వీచింది. గ‌డ‌చిన ఎన్నిక‌లకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పేసిన చాంద్ బాషా వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్‌ పై ఎమ్మెల్యేగా గెలిచారు. అనంత‌రం టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు ఆయ‌న తిరిగి త‌న సొంత గూటికి చేరుకున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించిన చాంద్ బాషాను పార్టీలోకి తిరిగి ఎలా చేర్చుకుంటారంటూ కందికుంట ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే పార్టీ భ‌విష్య‌త్తు దృష్ట్యా స‌ర్దుకుపోవాల‌ని, ఎవ‌రికీ అన్యాయం చేయ‌న‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన భ‌రోసాతో కందికుంట అయిష్టంగానే చాంద్ బాషా రీ ఎంట్రీకి త‌లూప‌క త‌ప్ప‌లేదు. చాంద్ బాషా తిరిగి పార్టీలోకి చేరినా... కందికుంట వ‌ర్గం ఆయ‌న‌ను ఎమ్మెల్యేగా అంగీక‌రించ‌డం లేదు. అంతేకాకుండా... చాంద్ బాషా కూడా కందికుంట వ‌ర్గాన్ని దూరం పెడుతూనే... అన్ని విభాగాల్లో త‌న అనుయాయుల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చాంద్ బాషా వైఖ‌రిపై గుర్రుగా ఉన్న కందికుంట‌... టీడీపీలో ఉండ‌లేక‌, పార్టీని వీడ‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ట్లుగా టీడీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి.

ఈ క్ర‌మంలో నిన్న క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని త‌న‌క‌ల్లు మండ‌ల కేంద్రంలో ఓ కీల‌క స‌మావేశం జ‌రిగింది. త‌న‌క‌ల్లు ఎంపీపీగా ఉన్న ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశం చూడ‌టానికి చాలా చిన్న‌దిగానే క‌నిపించినా... క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌నే మార్చేసేదిగానే చెప్పొచ్చు. నిన్న‌టి స‌మావేశంలో ల‌క్ష్మి మాట్లాడిన తీరు టీడీపీకి షాకిచ్చేదే. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీలో ఉంటున్నా... త‌న ప‌ద‌వుల కోసం పార్టీలు మారుతున్న చాంద్ బాషా లాంటి వారి వ్య‌వ‌హార స‌ర‌ళితో ఏ ఒక్క టీడీపీ కార్య‌క‌ర్త సంతోషంగా లేర‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా.... ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చే అవ‌కాశాలేమీ క‌నిపించ‌డం లేద‌ని, త‌క్ష‌ణ‌మే అంద‌రం క‌లిసి టీడీపీ ప‌ద‌వుల‌కు, పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామాలు చేద్దామంటూ ఆమె పిలుపునిచ్చారు.

స‌మావేశానికి హాజరైన వారంతా ఆమె వాద‌న‌తో ఏకీభ‌వించ‌డ‌మే కాకుండా... టీడీపీకి గుడ్ బై చెప్పేద్దామంటూ కూడా ఏక‌గ్రీవంగా తీర్మానించార‌ట‌. నేడో, రేపో వారంతా మూకుమ్మ‌డిగా టీడీపీకి రాజీనామాలు చేస్తార‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే... క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఇత‌ర మండ‌లాల టీడీపీ నేత‌లు కూడా ఇదే బాట‌లో న‌డిచే అవ‌కాశాలే అధికంగా క‌నిపిస్తున్నాయి. త‌న‌క‌ల్లు మండ‌లంలోని ల‌క్ష్మి వ‌ర్గ‌మంతా... కందికుంట వ‌ర్గంగానే ఉన్నారు. వీరు పార్టీకి రాజీనామాలు చేస్తే... కందికుంట వ‌ర్గంలోకి వారంతా కూడా ఇదే బాట‌న న‌డిచే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే... చివ‌ర‌కు కందికుంట కూడా టీడీపీకి గుడ్ బై చెప్పినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/