Begin typing your search above and press return to search.

ఐల‌య్య వ‌ర్సెస్ వైశ్యుల ర‌చ్చకు పోలీస్ స్టేష‌న్ వేదిక‌

By:  Tupaki Desk   |   8 Oct 2017 10:32 AM GMT
ఐల‌య్య వ‌ర్సెస్ వైశ్యుల ర‌చ్చకు పోలీస్ స్టేష‌న్ వేదిక‌
X
రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మ‌గ్ల‌ర్లు పుస్త‌కం క‌ల‌క‌లం ఇంకా కొన‌సాగుతోంది. ఐలయ్య త‌మ‌ను అవ‌మానించార‌ని పేర్కొంటూ క్షమాపణ డిమాండ్ చేస్తున్న ఆర్యవైశ్య సంఘాలు ఈ రోజు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరాయి. అయితే ఆ సవాల్ కు ఐలయ్య ముందుకురాలేదు. ``నేను ద్రావిడునను - ఆర్యవైశ్య లతో చర్చలకు సిద్ధంగా లేను` అని స్పందించారు. దీంతో కంచ ఐలయ్య ఇంటి ముట్టడికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు బయలుదేరగా...పోలీసులు మార్గ‌మధ్యంలోనే అరెస్టు చేశారు. ఇదే స‌మ‌యంలో తార్నాకలోని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ఇంటి ముందు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం నేతలు కంచ ఐలయ్య ఇంటికి చర్చలకు వస్తామనడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ కంచ ఐలయ్య మద్దతుదారులు భారీగా తార్నాకకు చేరుకున్నారు.

మ‌రోవైపు ఆర్యవైశ్య అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కంచె ఐలయ్యను సామరస్య చర్చలకు రావాలని పిలుపునిచ్చిన‌ట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు చ‌ర్చల‌కు రాకుండా ఇంట్లో కూర్చోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్ర‌శ్నించారు. సామాజిక స్మగ్లర్లు కోమ‌టోళ్లు అని రాసిన ఐలయ్యపై తెలంగాణ-ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. చాలా సార్లు చర్చకి సిద్ధం అన్న ఐలయ్య ఈరోజు చర్చకు రాకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. నేను ద్రావిడునను, ఆర్యవైశ్య లతో చర్చలకు సిద్ధంగా లేనంటున్న ఐల‌య్య త‌న పుస్త‌కంలో కించపర్చడం స‌రికాద‌ని ముందు తెలియదా అని ప్ర‌శ్నించారు. వెంటనే కంచె ఐలయ్యను అరెస్ట్ చేయకపోతే ఆర్యవైశ్య సంఘాలు అన్ని కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామ‌ని ఆర్యవైశ్య అధ్యక్షుడు స్ప‌ష్టం చేశారు. ఇంకో వారం రోజులలో వైశ్య సంఘం తరఫున భారీ సభను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు ఐలయ్య నివాసానికి వెళ్తున్న నేత‌ల‌ను అరెస్టు చేయ‌డంతో అంబ‌ర్‌ పేట్ పోలీస్ స్టేషన్ ఆర్యవైశ్యులు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.తమను రెచ్చ‌గొట్టాడ‌ని, సవాల్ ను స్వీకరించి చర్చకు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఐలయ్య రాకపోవడంతోనే ఆయ‌న ఇంటివ‌ద్ద‌కు ఆర్యవైశ్య సంఘం సభ్యులు బయలు దేరారని పోలీసుల‌కు వివ‌రించారు. వారితో వ‌రుసగా జ‌రిపిన చ‌ర్చ‌ల అనంత‌రం వివాదాల‌కు దూరంగా ఉండాల‌నే పూచిక‌త్తుతో పోలీసులు విడుద‌ల చేశారు.