ట్రంప్ కూతురుకు టీడీపీ ఎంపీకి లంకె పెట్టిన ఐలయ్య

Sat Oct 21 2017 22:42:18 GMT+0530 (IST)

ప్రొఫెసర్ - రచయిత కంచ ఐలయ్య ఇటీవల సంధిస్తున్న వాగ్భాణాలు ఆలోచనలే పడేసే రీతిలో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు మీడియా సమావేశం నిర్వహించిన ఐలయ్య ఈ సందర్భంగా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ముందుగా తన గురించి జరిగిన అసత్య ప్రచారంపై వివరణ ఇచ్చారు. దీపావళి రోజున తాను రాముణ్ని ధూషించినట్లు ఒక పత్రికలో వచ్చిన వార్త అవాస్తవని ఐలయ్య తెలిపారు. రచయతపై తప్పుడు ప్రచారం చేయడం మతతత్వ కుట్ర అని ఐలయ్య ఆరోపించారు.అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీనియర్ సభ్యుడు ట్రెంట్ ఫ్రాంక్స్ భారతదేశంలో వాక్ స్వాతంత్య్రం  ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారని ఐలయ్య గుర్తు చేశారు. దీనిపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందిస్తూ అమెరికా సంస్కృతిని - అమెరికన్ సెనెటర్ ను తీవ్రంగా హెచ్చరించారని పేర్కొంటూ...ఈ పరిణామం వల్ల అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు ప్రమాదకర పరిస్థితులు కల్పించారని ఐలయ్య వివరించారు. ``మానవహక్కులకు గౌరవం ఇవ్వని దేశాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టవు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 3నెలలకోసారి అమెరికాను సందర్శిస్తారు. ఆయన ఆర్థిక లక్ష్యాలకు కూడా టీజీ వెంకటేష్ వ్యవహారశైలి వల్ల నష్టం కలుగుతుంది.`` అని ఐలయ్య వివరించారు. ``ఐలయ్యను చంపడం టైం వేస్టు అని చేసిన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం. టైం వేస్టు కాకుండా చంపిన ఘటనలు చాలా ఉన్నాయనే స్పష్టమైంది. ఆ జాబితాలో గౌరీ లంకేష్ కల్బుర్గి పన్సరే ఉన్నారా...? చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే టీజీ వెంకటేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి`` అని డిమాండ్ చేశారు.

ఫత్వాలు జారీచేసే వెంకటేష్ హైదరాబాద్లో ఉంటే  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంకా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలా మొగ్గుచూపుతుందని కంచ ఐలయ్య కొత్త పాయింట్ లాగారు. తద్వారా వచ్చే నవంబరులో 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఫలితాలపై ముందస్తుగా సందేహాలు వ్యక్తం చేశారు. నారాయణ చైతన్య కాలేజీలు మూసేయాలని ఐలయ్య డిమాండ్ చేశారు. ఇంటర్మీడియేట్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు కోర్టు మురుగన్ కేసులో భావప్రకటనకు సంభంధించి కేసులు నమోదు చేయొద్దని స్పష్టంగా చెప్పిందని...దీన్ని పాటించాలని అన్నారు. బహుజన ప్రతిఘటన వేదిక అధ్యక్షుడు ఊసా మాట్లాడుతూ విజయవాడలో తాము నిర్వహించనున్న సభకు ఐలయ్య హాజరవుతారని తెలిపారు.  ఐలయ్యను అడ్డుకుంటామంటున్న బ్రహ్మణ వైశ్య సంఘాల ప్రయత్నం అభాసు పాలు అవుతుందని జోస్యం చెప్పారు. ఆ సంఘాలు ఐలయ్యపై దాడులు ప్రారంభిస్తే... దాడుల్ని ముగించే అవకాశం వారి చేతుల్లో ఉండదని హెచ్చరించారు. బీసీ నేతకు దక్కాల్సిన ఎంపీ సీటును 100 కోట్లిచ్చి టీజీ వెంకటేశ్ కొనుక్కున్నాడని ఆరోపించారు. కల్లుమీద వాలిన ఈగ లాంటి వ్యక్తి టీజీ వెంకటేశ్ అని ఆరోపించారు.