Begin typing your search above and press return to search.

కామినేనీ...గిరిజ‌నం అంటే ఇంత నిర్ల‌క్ష‌మా?

By:  Tupaki Desk   |   27 Jun 2017 10:32 AM GMT
కామినేనీ...గిరిజ‌నం అంటే ఇంత నిర్ల‌క్ష‌మా?
X
గిరిజ‌నులు... అట‌వీ ప్రాంతాల‌నే ఆవాసంగా చేసుకుని జీవ‌నం సాగించే జ‌నం. అంటే అడ‌వి త‌ల్లి బిడ్డ‌ల కిందే వారు లెక్క‌. వారి ప్ర‌త్యేక‌మైన జీవ‌న శైలిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలే కాదు... ఏకంగా అంత‌ర్జాతీయ సంస్థ‌లు కూడా ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెడుతున్న వైనం మ‌న‌కు తెలిసిందే. అస‌లు గిరిజ‌నుల జీవ‌న శైలికి ప్ర‌మాదం ఉంద‌న్న కార‌ణంగా చాలా సాగునీటి ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు నిరాక‌రించిన సంద‌ర్భాలె ఎన్నో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌తిష్ఠాత్మక ప్రాజెక్టుగా ప‌రిగ‌ణిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోల‌వరం ప్రాజెక్టుకు కూడా అనుమ‌తుల విష‌యంలో గిరిజ‌నుల‌కు ముప్పుందేమోన‌న్న కోణంలో కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ చాలా లోతుగా ప‌రిశీలించిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. ఈ కార‌ణంగానే గ‌తంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు అనుమ‌తుల మంజూరులో కేంద్ర ప్ర‌భుత్వం సుదీర్ఘ జాప్య‌మే చేసింద‌న్న ప‌చ్చి నిజ‌మం కూడా మ‌నం మ‌రిచిపోలేనిది. అంటే గిరిజ‌నులకు ఏమాత్రం క‌ష్టం వ‌చ్చినా కూడా ఎంతమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాద‌ని ఈ అన్ని విష‌యాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి.

ఇంత‌టి ప్రాధాన్యం ఉన్న గిరిజనుల ప‌ట్ల చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎంతమేర నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌న్న దానికి ఇప్పుడు ప‌క్కా నిద‌ర్శ‌నం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. చంద్ర‌బాబు కేబినెట్‌ లోని కీల‌క శాఖ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే... తూర్పుగోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన చాప‌రాయిలో క‌లుషితాల కార‌ణంగా ఏకంగా 16 మంది గిరిజ‌నులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాగానే... రాష్ట్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయిపోయింది. అధికార యంత్రాంగాన్ని ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తోంది. ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తే త‌ప్పించి ఆ జిల్లా క‌లెక్ట‌ర్ అక్క‌డికి వెళ్లలేని దుస్థితి... అక్క‌డి గిరిజ‌నుల‌పై స‌ర్కారు ఎంత‌మేర నిర్ల‌క్ష్యం వ‌హిస్తుందో ఇట్టే అర్థం కాక‌మాన‌దు. ఈ వైనంపై ఏపీ వైద్య‌ - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ కాసేప‌టి క్రితం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చాపరాయి గ్రామంలో 16 మంది గిరిజనులు చనిపోయిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఆ గ్రామంలో కేవలం 60 మంది మాత్రమే ఉంటున్నారని, 60 మంది కోసం రోడ్లు వేయడం - నీళ్లివ్వడం - వైద్యం అందించడం కష్టమని అన్నారు. గిరిజనులు కొండప్రాంతాల్లో ఉంటే.. వారికి ఈ వసతులన్ని ఎలా కల్పించగలమని? ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నామంటూ ఆయ‌న తాపీగా చెప్పుకొచ్చారు. 60 మంది ఉన్న ఆవాసాన్ని గ్రామంగా గుర్తిస్తున్న‌ప్పుడు, ఆ గ్రామాన్ని మిగిలిన గ్రామాల సంఖ్య‌తో క‌లుపుకుని త‌మ రాష్ట్రంలో ఇన్ని గ్రామాలున్నాయ‌ని చెప్పుకుంటున్న‌ప్పుడు... ఆ గ్రామానికి రోడ్లు - వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై లేదా? అన్న వాద‌న వినిపిస్తోంది. కేంద్రాన్ని నిధులు అడిగేట‌ప్పుడు ఇన్ని గ్రామాలు వెనుక‌బ‌డి ఉన్నాయ‌ని చెప్పుకుంటున్న‌ప్పుడు... ఆ గ్రామానికి సౌక‌ర్యాలు క‌ల్పించే విష‌యంలో ఈ నిర్ల‌క్ష్య‌పు మాట‌లెందుకో చంద్ర‌బాబు స‌ర్కారే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/