Begin typing your search above and press return to search.

హ‌రిబాబు ఎంట్రీ!..బాబుకు ద‌బిడిదిబిడే!

By:  Tupaki Desk   |   15 April 2018 10:14 AM GMT
హ‌రిబాబు ఎంట్రీ!..బాబుకు ద‌బిడిదిబిడే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై టీడీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వినిపిస్తున్న వాద‌న‌లో ఏమాత్రం స‌త్తా లేద‌ని తేల్చే ప‌ని షురూ అయ్యింద‌నే చెప్పాలేమో. నిన్న‌టిదాకా టీడీపీ మిత్ర‌ప‌క్షంగా - ఇప్పుడు వైరివ‌ర్గంగా మారిన బీజేపీలో బాబుకు అనుకూల వ‌ర్గం కూడా ఉంద‌న్న వాద‌న లేక‌పోలేదు. ఈ అనుకూల వ‌ర్గంలో విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ చీఫ్ కంభంపాటి హ‌రిబాబు ముందువ‌రుస‌లో ఉంటార‌న్న విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. హ‌రిబాబు కంటే ముందువ‌రుస‌లో ఉన్న భార‌త ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ఉన్నా.. ఆయ‌న ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉండ‌టంతో బాబుకు నిజంగానే పెద్ద మైన‌స్సేన‌ని చెప్పాలి. అయితే ఈ మైన‌స్‌ను హ‌రిబాబు పూరిస్తారులే అన్న భావ‌న‌లో ఉన్న చంద్ర‌బాబుకు ఇప్పుడు గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... బీజేపీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఏపీకి అన్యాయం జ‌రిగిన విష‌యంలో త‌న త‌ప్పేమీ లేద‌ని, మొత్తం పాప‌మంతా బీజేపీదేన‌ని చెబుతున్న బాబుపై స్వ‌యంగా హ‌రిబాబే రంగంలోకి దిగిపోయారు మ‌రి. రంగంలోకి దిగ‌డ‌మంటే మిగిలిన నేతల మాదిరిగా హ‌రిబాబు... బాబుపై విమ‌ర్శ‌ల‌తోనే స‌రిపెట్ట‌కుండా బాబు రెండు నాల్క‌ల ధోర‌ణిని ఎండ‌గ‌డుతూ ఏకంగా ఓ బుక్కునే విడుద‌ల చేసేశారు.

ఈ బుక్ లో ఏపీకి కేంద్రం ఏ మేర సాయం చేసింద‌న్న వివ‌రాలు మాత్ర‌మే ఉన్నా... ఈ బుక్ విడుద‌ల సంద‌ర్భంగా హ‌రిబాబు... బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌న్న ప్ర‌స్తావ‌న‌తో మొద‌లెట్టిన హ‌రిబాబు... ప్ర‌త్యేక హోదా అక్క‌ర్లేదు, ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే స‌రిపోతుంది, ఏపీ ప‌ట్ల బీజేపీ స‌ర్కారు చాలా ద‌యార్ద హృద‌యంతో ఉంద‌ని, ఇందుకు బీజేపీకి ధ‌న్యవాదాలు తెలుపుతూ బాబు స‌ర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసిన విష‌యాన్ని కూడా బ‌య‌ట‌పెట్టేశారు. మొత్తంగా ఈ బుక్ తో బాబుకు హ‌రిబాబు పెద్ద దెబ్బే వేశార‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అయినా ఈ పుస్త‌కం ద్వారా హ‌రిబాబు చెప్పిన విష‌యాలేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు అన్నింటిని ప్ర‌త్యేక‌ ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇవ్వాలనుకుంద‌ని హ‌రిబాబు చెప్పారు. ఈ పుస్త‌కాన్ని బహిరంగ లేఖగా కూడా ప‌రిగ‌ణించాల్సిందేన‌ని కూడా హ‌రిబాబు పేర్కొన్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని హర్షిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారని కూడా ఆయ‌న‌ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు హఠాత్తుగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ విషయాన్ని చంద్ర‌బాబు ప్రజలకు వివరించాల్సి ఉంటుందని కూడా హ‌రిబాబు పేర్కొన్నారు.

కొంతమంది తెలియక బీజేపీపై లేనిపోని దుష్ప్ర‌చారం చేస్తున్నారని హరిబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ ప్యాకేజీ ద్వారా ఏపీకి సాయం చేయాలని కేంద్రం భావించిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తాము ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేవలం రూ.15వేల కోట్ల నుంచి 16వేల కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని కంభంపాటి హరిబాబు చెప్పారు. 2015-16కు సంబంధించి కేంద్రం నుంచి రూ.9,487 కోట్లు ఇచ్చారన్నారు. 2016-17కు సంబంధించి రూ.17,242 కోట్లు ఇచ్చామన్నారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ఆర్థిక లోటును భర్తీ చేయాలని తాము భావించామని హరిబాబు చెప్పారు. ప్రాజెక్టులు ఏపీ నుంచి తరలిపోతున్నాయని టీడీపీ నేత తోట నర్సింహులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి నష్టమని చంద్రబాబు గుర్తించాలని ఆయ‌న‌ సూచించారు. అయినా, కేంద్రాన్ని - ప్రధానిని విమర్శించినంత మాత్రాన ఏపీకి సాయం ఆగదని చెప్పారు. ఏపీకి సరైన సాయం చేస్తామని చెబుతుంటే చంద్ర‌బాబుకు వినబ‌డ‌కపోడవం విడ్డూరమన్నారు. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోడీని విమర్శించడం విచారకరమని హ‌రిబాబు త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టారు. మొత్తంగా త‌న‌కు అనుకూలంగా ఉన్న హ‌రిబాబు నుంచి ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం చంద్ర‌బాబుకు నిజంగానే జీర్ణించుకోలేనిదేనన్న విశ్లేష‌ణలు సాగుతున్నాయి.