Begin typing your search above and press return to search.

ఏపీ కోసం బీజేపీ కొత్త డిమాండ్‌

By:  Tupaki Desk   |   29 Aug 2015 8:53 AM GMT
ఏపీ కోసం బీజేపీ కొత్త డిమాండ్‌
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు న్యాయం చేసేందుకు రాజ‌కీయ పార్టీలు కొత్త‌ విధానాల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నాయి. ప్ర‌తిప‌క్ష వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌త్యేక హోదా, రాయితీలు త‌దిత‌రాల‌న్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలిచి రాష్ర్టంలో అధికార పీఠం ఎక్కిన తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ హామీల‌ను పూర్తి స్థాయిలో నెర‌వేర్చ‌లేక‌...త‌మ‌కు అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా త‌గు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో పార్టీలు త‌మ త‌మ అజెండాల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు తామే న్యాయం చేయ‌గ‌ల‌మ‌ని ప్ర‌చారం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కొత్త డిమాండ్‌ ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో రాజమండ్రిలో ఏపీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అనంత‌రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ లో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలున్నాయి కాబట్టి జిల్లాలు కూడా 25 ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విధంగా త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను త్వరితగతిన పూర్తి చేస్తోందని..అదే విధంగా పోలవరం నిర్మాణ పనులు కూడా త్వరగా చేపట్టేలా రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. నిత్యావసర వస్తువులు..ఇసుక విధానంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు.

కంభంపాటి కొత్త డిమాండ్‌ ను తెర‌మీద‌కు తేవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జిల్లాల ఏర్పాటు అవ‌స‌రం ఉందా లేదా అనే చ‌ర్చ‌ను ప‌క్క‌న‌పెడితే...జిల్లాల పున‌ర్ విభ‌జ‌న అనేది రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉన్న అంశం. ఈ డిమాండ్‌ ను తెర‌మీద‌కు తేవ‌డం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కు కొత్త ఆశ‌లు క‌ల్పించిన వారు అవుతారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌నే చ‌ర్చ‌ను కూడా తీసుకురావ‌చ్చున‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుల వారు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.