Begin typing your search above and press return to search.

పీకేకు బీజేపీ నుంచి స‌మ‌ర్థ‌న వ‌చ్చిందే!

By:  Tupaki Desk   |   20 March 2018 9:30 AM GMT
పీకేకు బీజేపీ నుంచి స‌మ‌ర్థ‌న వ‌చ్చిందే!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఇప్పుడు ఇంటా బ‌య‌టా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదురు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. గ‌తవారం త‌న పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని డిమాండ్ చేయ‌డంతో పాటు టీడీపీ అవినీతి పాల‌న‌పై నిప్పులు చెరిగిన ప‌వ‌న్‌కు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. ఒక్క టీడీపీ మిన‌హా దాదాపుగా మిగిలిన పార్టీల‌న్నీ కూడా ప‌వ‌న్‌ ను ధైర్యాన్ని కీర్తించాయి. అయితే ఆ పొగ‌డ్త‌ల‌ను ప‌వ‌న్ నిలుపుకునేలా వ్య‌వ‌హ‌రించలేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని చాలా గ‌ట్టిగా నిన‌దించి రోజులు కూడా గ‌డ‌వ‌కముందే... ప్ర‌త్యేక హోదా కాకున్నా... ఏపీకి ఏ రూపంలో నిధులిచ్చినా ఫ‌ర‌వా లేదంటూ ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ పేర్కొన్నారు. ఈ ఒక్క మాట ప‌వ‌న్‌ ను అంద‌రికీ దూరం చేసింద‌నే చెప్పాలి. నాలుగేళ్ల పాటు త‌న‌తో క‌లిసి సాగిన ప‌వ‌న్‌... ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్న వైనంపై ఆగ్ర‌హంగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడికి నిజంగానే ఓ బ్ర‌హ్మాస్త్రాన్ని అందించార‌న్న వాద‌న వినిపిస్తోంది. ప‌వ‌న్ యూట‌ర్న్ వెనుక బీజేపీ హ‌స్త‌ముంద‌ని ఆరోపించిన చంద్ర‌బాబు... బీజేపీతో చేతులు క‌లిపిన ప‌వ‌న్ రాష్ట్రానికి మ‌రోమారు అన్యాయం చేసేందుకు సిద్ధ‌మైపోయార‌న్న ఆరోప‌ణ‌ను వినిపించారు.

ఈ క్ర‌మంలో ఏ రూపంలోనైనా నిధులు ఇస్తే చాల‌న్న మాట తాను అన‌లేద‌ని జ‌న‌సేనాని చెప్పుకున్నా కూడా ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల జ‌డివాన ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలో నిన్న ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా హోదాపై మాట మార్చిన ప‌వ‌న్‌ కు ఏకంగా స‌మ‌ర్ధ‌న వ‌చ్చేసింది. స‌మ‌ర్ధ‌న అంటే పొగ‌డ్తే క‌దా. మ‌రి ఆ పొగ‌డ్త ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఇంకెక్క‌డి నుంచి వ‌స్తుంది? బీజేపీ నుంచే ఆ స‌మ‌ర్ధ‌న వ‌చ్చింది. బీజేపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు - విశాఖ ఎంపీగా ఉన్న కంభంపాటి హ‌రిబాబు... ప‌వ‌న్ కల్యాణ్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించారు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా హ‌రిబాబు... ప‌వ‌న్ కామెంట్ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హోదా పేరులో ఏముందని - తగినట్లుగా సాయం చేయాలని ఎవరు అన్నా తాను సమర్తిస్తున్నట్లు ఈ సంద‌ర్భంగా హ‌రిబాబు తెలిపారు పవన్ కల్యాణ్ బీజేపీతో ఉన్నారో లేదో తనకు తెలియదని అంటూనే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్ధించ‌డం గ‌మ‌నార్హం. ఏపీకి నిధులు రావాలని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తానని హరిబాబు చాలా స్ప‌ష్టంగానే చెప్పుకొచ్చారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరిన‌ సహాయం చేయాలని తాము కేంద్రాన్ని కోరనున్నట్లు కూడా హ‌రిబాబు తెలిపారు ప్రత్యేక హోదాకు మారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అనే పేరు కావాలని పట్టుబడుదామా? లేదంటే ప్రత్యేక హోదా వల్ల లభించే ప్రయోజనాలతో కూడిన నిధులను రాబట్టుకుందామా? అని హరిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని - రాజకీయ పార్టీలను అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాల ప్రయోజనాలనూ కల్పించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, రెవెన్యూ లోటుపై ఇప్పటికే రూ.4000 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన చెప్పారు. మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతూనే ఉన్నారని కూడా ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు పెట్టలేదని ఆయన కాంగ్రెస్‌ పార్టీని హ‌రిబాబు ప్రశ్నించారు.