రజనీని క్రాస్ చేసేసిన కమల్

Mon Apr 09 2018 12:38:45 GMT+0530 (IST)

తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి సూపర్ స్టార్ రజనీ తర్వాతే కమల్ హాసన్. పేరుకు వీరిద్దరూ కోలీవుడ్ కు రెండు కళ్లుగా అభివర్ణించినా.. రజనీ తర్వాతే కమల్ స్థానం అన్నది అందరికి తెలిసిందే. సినిమాల్లో రజనీ తర్వాతే తన స్థానమని కమల్ హాసన్ కూడా ఒప్పేసుకుంటారు.అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమ్మ మరణం తర్వాత సామాజిక అంశాల మీద గళం విప్పటం మొదలెట్టారు కమల్ హాసన్. ఇందుకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నారు. వివిధ అంశాల మీద తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా వెల్లడించటంతో పాటు.. తనకేం అనిపించిందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేయటంతో ఆయన తీరు గడిచిన కొంతకాలంగా పలువురిని ఆకర్షిస్తోంది.

ఇదే ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీ ఇమేజ్ ను కమల్ క్రాస్ చేసేలా చేసింది. అయితే.. ఇదంతా సినిమాలకు సంబంధించి కాదు. సోషల్ మీడియాకు సంబంధించి. రజనీతో పోలిస్తే కమల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో కమల్ ఖాతాకు 46.95 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. రజనీ ట్విట్టర్ ఖాతాకు 46.15 లక్షల మంది మాత్రమే ఫాలో చేస్తున్నారు. రజనీతో పోలిస్తే కమల్ ఎప్పటికప్పుడు ట్వీట్లతో చురుగ్గా ఉండటంతో పాటు తరచూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే పోస్టులు పెట్టటం వల్ల తలైవా వెనుకబడి ఉంటారని చెబుతున్నారు. ఏమైనా.. సిల్వర్ స్క్రీన్ మీద రజనీని బీట్ చేసే వారు లేనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆయన్ను ఆయన చిరకాల స్నేహితుడే క్రాస్ చేయటం విశేషం.