అభిమానం వెనక రాజకీయమా కమల్.?

Wed Jun 13 2018 12:29:13 GMT+0530 (IST)

రాజకీయాలు సినిమాలు వేరు వేరు.. కానీ రాజకీయాల్లోకి వచ్చాక చాలామంది సినీ తారలు మారిపోతుంటారు. తమిళనాట జయలలిత సీఎం అయ్యాక అభిమానులతో మీట్ అయ్యింది చాలా తక్కువ. తనను కలవడానికి కూడా సాధారణ అభిమానులను అనుమతించేవారు కాదు.. అయితే కమల్ హాసన్ మాత్రం కొత్త ఒరవడి సృష్టించాడు. తన అభిమాని కోరిక తీర్చాడు.ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. సినిమాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టి పార్టీ పెట్టి పోరాడుతున్నారు. అయితే తాజాగా కమల్ హాసన్ కు వీరాభిమాని అయిన జయరాజ్ అభిమాన హీరోను కలవడానికి వచ్చాడు. కానీ సెక్యూరిటీ అతడిని కలవనీయలేదు. అనంతరం ఏడుస్తూ ఉండిపోగా కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ గా మారింది. కమల్ వీరాభిమాని వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కమల్ దృష్టికి వచ్చింది.

దీంతో వెంటనే స్పందించిన కమల్ హాసన్ తన అభిమాని జయరాజ్ ను ఇంటికి ఆహ్వానించాడు.అతడితో కులాసాగా మాట్లాడి భోజనం చేయించి మర్యాదలు చేశాడు. ఇలా రాజకీయాల్లోకి వెళ్లాక కూడా కమల్ తన ఫ్యాన్స్ పై చూపుతున్న అభిమానానికి ప్రజల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే రాజకీయాల్లోకి వెళ్లాక మైలేజ్ కోసం కమల్ హాసన్ ఇదంతా చేస్తున్నాడని కొందరు విమర్శలు  గుప్పించారు. ఏదీ ఏమైనా కమల్ దేనికోసం చేసిన ఆ అభిమాని కోరిక మాత్రం నెరవేరింది.