ఆ వేదిక మీదే లోకనాయకుడి కీలక ప్రకటన

Wed Sep 13 2017 13:30:33 GMT+0530 (IST)

ఒకరి తర్వాత ఒకరుగా సినీ నటులు రాజకీయ రంగప్రవేశానికి ఆసక్తి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న వారిలో లోక నాయకుడుగా సుపరిచితులు కమల్ హాసన్ ఒకరు. తమిళనాడు అమ్మ జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు చాలా మారిపోయాయి. తీవ్రమైన రాజకీయ అనిశ్చితి నెలకొంది.తమిళులు కోరుకున్న రీతిలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోకపోవటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  దీనికి తోడు ఎప్పుడు సందు దొరికితే అప్పుడు తమిళరాజకీయాల్లో వేలు పెట్టటానికి సిద్ధంగా ఉన్న బీజేపీ తీరుపైనా తమిళులు అస్సలు ఇష్టపడటం లేదు. ఇలాంటి వేళలో రాజకీయాల్లోకి వచ్చేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సహా.. మరో నట దిగ్గజం కమల్ హాసన్ కూడా రాజకీయ రంగప్రవేశం మీద దృష్టి పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ వాదనల్లో నిజమన్నట్లుగా తాజాగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మతచాందస వాదానికి వ్యతిరేకంగా సీపీఎం నేతృత్వంలో నేషనల్ సెమినార్ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హాజరవుతున్నట్లుగా వెల్లడించారు. ఈ సెమినార్ వేదిక మీద నుంచే కమల్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీంతో ఈ సెమినార్ మీద అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమానికి (ఆగస్టు 6న)   కేరళ ముఖ్యమంత్రి పినరయ కూడా రానున్నారు. ఇటీవల కేరళలో ముఖ్యమంత్రి పినరయితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తమిళనాడు రాజకీయాల గురించి చర్చ జరిపారు.

మళ్లీ ఇప్పుడు ఒకే వేదికను ఈ ఇరువురు కలవనున్నారు. కోజికోడ్ లో ఠాగూర్ సెంటినరీ హాల్ వేదికగా జరిగే కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి ప్రారంభించనున్నారు. ఈ వేదిక మీద నుంచే కమల్ తన రాజకీయ అరంగేట్రం మీద కీలక ప్రకటన చేయనున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ అంచనా ఎంతవరకు నిజమన్నది ఈ నెల 16న తేలిపోనుంది.