‘కోలీ’ పాలిటిక్స్ : తారలు కలిసిన శుభవేళ

Sun Feb 18 2018 16:21:31 GMT+0530 (IST)

కోలీవుడ్ లో ముందు ముందు పాలిటిక్స్ కు సినిమా రంగానికి తేడా లేకుండాపోయేలా ఉంది. ప్రముఖ సూపర్ స్టార్ లు రజనీకాంత్ కమల్ హాసన్ కొత్త పార్టీలతో హడావిడి చేయబోతుండడం.. అదే సమయంలో ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న విజయకాంత్ అలాంటి ఆలోచనలే చేస్తున్న విశాల్ తదితర సినిమా హీరోల ప్రభావంతో కోలీవుడ్ మొత్తం రాజకీయమయంగానే ఆ రంగు పులుముకోబోతున్నట్లుగా కనిపిస్తోంది.ఇద్దరు ప్రధాన సూపర్ స్టార్లు రజినీ - కమల్ ఇప్పటికే రాజకీయ ప్రస్థానం గురించి ప్రకటించేసిన నేపథ్యంలో.. ఆదివారం పోయెస్ గార్డెన్ లోని రజినీ నివాసానికి కమల్ హాసన్ వచ్చి ఆయనతో భేటీ కావడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తోంది. అయితే భేటీ తరువాత ఈ నాయకులు మాట్లాడుతూ.. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యమూ లేదని మాత్రం సెలవిచ్చారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయదలచుకుంటున్న నేపథ్యంలో రజనీని కలిసి సమాచారం ఇవ్వడానికి మాత్రమే వచ్చినట్లు కమల్ వెల్లడించడం విశేషం. రజనీ కూడా పార్టీ ప్రకటన తర్వాత.. వివిధ పార్టీల నేతలను కలిశారు. అయితే కమల్ కొన్ని రోజుల కిందట రజనీ పార్టీతో కలిసే ఉద్దేశమే లేదని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం హెచ్చింది.

ఇద్దరూ ఒకే తాను ముక్కలు.. సినీ రంగానికి చెందిన వారే.. అలాంటప్పుడు విడివిడిగా ఉండడం సినీప్రియత్వం నిండిన ఓటు బ్యాంకును చీల్చుకోవడమే అవుతుంది కదా.. అది రాజకీయ ప్రత్యర్థులకు లాభం కలిగిస్తుంది కదా.. అని పలువురు భావిస్తున్నారు.