పంచెకట్టులో లోకనాయకుడి లుక్ అదుర్స్!

Thu Oct 12 2017 22:34:32 GMT+0530 (IST)

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తన రాజకీయ అరంగేట్రంపై రజనీ ఇప్పటివరకూ పూర్తి స్పష్టతనివ్వలేదు. మరోవైపు కమల్ హాసన్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ప్రకటించారు. నవంబరు 7న కమల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త పార్టీ ఆవిష్కరణ జరగవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అప్పటివరకు తన అభిమానులందరూ రాజకీయాల ద్వారా సమాజ సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కమల్ పిలుపునిచ్చారు.కమల్ తన రాజకీయ అరంగేట్రం కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలకైనా - సినిమాలకైనా పబ్లిసిటీ చాలా ముఖ్యం. అందుకే కమల్ తాను రాజకీయ నాయకుడి గెటప్ లో ఏ విధంగా ఉంటానో అని టెస్ట్ చేసుకునేందుకు పంచె కట్టులో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళనాడు సంప్రదాయమైన పంచెకట్టులో కమల్ అదిరిపోయే ఫోజిచ్చారు. టిపికల్ తమిళ్ పొలిటిషియన్ లుక్ లో ఉన్న లోకనాయకుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధోవతి - చొక్కా ధరించిన కమల్ పంచె పైకి కడుతూ - పిడికిలి బిగించి చేతిని పైకెత్తిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కమల్ ప్రారంభించబోయే రాజకీయ పార్టీ తమిళ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో కమల్ పార్టీ తమిళనాడులో బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తే దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.