Begin typing your search above and press return to search.

రాజ‌కీయ ముళ్ల కిరీటానికి సిద్ధం: క‌మ‌ల్‌

By:  Tupaki Desk   |   22 Sep 2017 9:09 AM GMT
రాజ‌కీయ ముళ్ల కిరీటానికి సిద్ధం: క‌మ‌ల్‌
X
త‌మిళ‌నాడులో పుర‌చ్చి త‌లైవి జ‌య ల‌లిత మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయ చద‌రంగం మొద‌లైంది. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - నటుడు క‌మ‌ల్ హాస‌న్ లు రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ కూడా ప‌లు సంద‌ర్భాల్లో త‌న రాజ‌కీయ ప్ర‌వేశంపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం చెన్నైలో క‌ల‌వ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. వారిద్ద‌రి భేటీ త‌ర్వాత క‌మ‌ల్ మీడియాతో మాట్లాడిన క‌మ‌ల్ త‌న రాజ‌కీయ అరంగేట్రంపై ప‌క్కా క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. తమిళనాడు ప్రజలు తాను ముఖ్యమంత్రి కావాల‌ని ఎదురు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 'రాజ‌కీయ' ముళ్ల కిరీటాన్ని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాన‌ని క‌మ‌ల్ చెప్పారు.

తమిళనాడులో జ‌రుగుతున్న‌ చీకటి - రిసార్ట్ రాజకీయాలతో ప్ర‌జ‌లు విసిగివేసారి పోయార‌ని, వారు ప్ర‌త్యామ్నాయం కోసం వెతుకుతున్నార‌ని చెప్పారు. తమిళనాడు ప్రజలపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, త‌న‌ను వారు కచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తారని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. త‌న రాజ‌కీయ ప్ర‌వేశాన్నిఅడ్డుకోవ‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌న్నారు. అయితే, వ్యాపారం చెయ్యడానికి రాజకీయాల్లోకి రావడంలేదని, కేవ‌లం ప్రజలకు సేవ చేయాల‌న్న‌దే త‌న ఉద్దేశ‌మ‌ని చెప్పారు. త‌మిళ‌నాడులో రైతులు - ప్రజల కష్టాలను ప్రభుత్వం విస్మ‌రించిందని కమల్ హాసన్ ఆరోపించారు. తాను ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోద‌లుచుకోలేద‌ని, ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతాన‌ని కమల్ హాసన్ చెప్పారు.

ఏఐడీఎంకే కు, త‌మిళనాడు ప్ర‌జ‌ల‌కు బ‌ల‌వంతంగా పెళ్లి చేశార‌ని, త్వ‌ర‌లోనే ఆ పెళ్లి పెటాకుల‌వుతుంద‌ని జోస్యం చెప్పారు. రాబోయే 3 నెల‌ల్లో త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌రిగినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని క‌మ‌ల్ ప్ర‌క‌టించారు. కొద్ది రోజుల క్రితం తాను ర‌జ‌నీకాంత్ ను క‌లిశాన‌ని, చాలా సేపు మాట్లాడాన‌ని క‌మ‌ల్ చెప్పారు. తాను రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్లు ర‌జ‌నీతో చెప్పాన‌ని క‌మ‌ల్ అన్నారు. అయితే, త‌మ ఇద్ద‌రి దారులు వేర‌ని, ర‌జ‌నీ వేరొక దారిని ఎంచుకున్నార‌ని చెప్పారు. అయితే, తాము సినిమా రంగంలో మాత్ర‌మే పోటీదారుల‌మ‌ని, రాజ‌కీయాల్లో తాము అలా ఉండబోమ‌ని చెప్పారు. ఒక రకంగా రాజ‌కీయాల్లో తామిద్ద‌రం స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేయ‌బోతున్నామ‌ని చెప్పారు.