Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌దీ... ప‌వ‌న్ బాటేనా!

By:  Tupaki Desk   |   21 Feb 2018 2:52 PM GMT
క‌మ‌ల్‌దీ... ప‌వ‌న్ బాటేనా!
X
త‌మిళ‌నాట మ‌రో రాజకీయ పార్టీ రంగంలోకి దిగేసింది. చాలా రోజుల క్రిత‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశానంటూ ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌... నేటి సాయంత్రం త‌న పార్టీ పేరుతో పాటు లోగోను ఆవిష్క‌రించారు. త‌న పార్టీ పేరును *మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్‌*గా ప్ర‌క‌టించిన క‌మ‌ల్... దాని అర్థాన్ని కూడా పూర్తిగానే వివ‌రించారు. త‌మిళంలో మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ అంటే... పీపుల్స్ జ‌స్టిస్ పార్టీ అనేన‌ట‌. పార్టీ పేరు ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే క‌మ‌ల్ త‌న పార్టీ లోగోను కూడా ఆవిష్క‌రించారు. ఈ లోగో చాలా ఆస‌క్తిక‌రంగానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఐక‌మ్య‌తానికి చిహ్నంగా ఆరు చేతుల‌ను ఒక‌దానితో మ‌రో చేతిని ప‌ట్టించేసిన క‌మ‌ల్‌... వాటిన్నింటినీ వృత్తాకారంలో అమ‌ర్చేశారు. అదే స‌మ‌యంలో ఆ చేతుల మ‌ధ్య‌లో ఓ న‌క్ష‌త్రాన్ని కూడా పొందుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ త‌న పార్టీ పేరును మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్‌గానే ఎందుకు పెట్టానన్న విష‌యాన్ని చెబుతూ... *నేను మీలోంచి వచ్చిన వ్యక్తిని. తలైవాను మాత్రం కాదు. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదు. నాయకుడిగా భావించడం లేదు. సామాన్య జనంలో నుంచి పుట్టుకొచ్చిన ఒకడిని. ప్రజా సేవకుడిగా కొనసాగాలని భావిస్తున్నాను. ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటాను* అని గొప్ప‌గా ప్ర‌క‌టించారు.

ఇదంతా బాగానే ఉన్నా గ‌డ‌చిన ఎన్నిక‌ల కంటే ముందుగానే తెలుగు నాట రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న పార్టీ పేరును జ‌న‌సేన‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ముందే పార్టీని పెట్టిన నేప‌థ్యంలో నాటి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని చెప్పిన ప‌వ‌న్‌... 2019 ఎన్నికల్లో మాత్రం ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగుతాన‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. అంతేకాకుండా జ‌న‌సేన లోగోను కూడా ప‌వ‌న్ నాడే ఆవిష్క‌రించారు. ఇప్పుడు క‌మ‌ల్ ఆవిష్క‌రించిన లోగో కూడా దాదాపుగా జ‌న‌సేన లోగోను పోలి ఉంద‌న్న మాటే వినిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ లోగో కూడా వృత్తాకారంలోనే ఉండ‌గా, దాని మ‌ధ్య‌లో న‌క్ష‌త్రం ఉన్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన లోగోను పోలిన‌ట్లుగానే ఉన్న క‌మ‌ల్ పార్టీ లోగో కూడా వృత్తాకారంలోనే ఉంది. అంతేకాకుండా జ‌న‌సేన లోగోను కాపీ కొట్టిన చందంగా వృత్తం మ‌ధ్య‌లో స్టార్‌ను పెట్టేసిన క‌మ‌ల్‌... లోగోలో రంగుల విష‌యంలోనూ ప‌వ‌న్‌ను అనుక‌రించిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ జెండాలో ఎరుపు, తెలుపు రంగులు మాత్ర‌మే క‌నిపిస్తాయి.

ఇప్పుడు క‌మ‌ల్ ఆవిష్క‌రించిన త‌న పార్టీ లోగోలో కూడా ఈ రెండు రంగులే క‌నిపిస్తున్నాయి. వృత్తాకారంలోని ఆరు చేతుల్లో మూడు తెలుపు రంగులో ఉంటే... మిగిలిన మూడు ఎరుపు రంగులో ఉన్నాయి. ఇక వృత్తం మ‌ధ్య‌లో ఉన్న న‌క్ష‌త్రం తెలుగు రంగులో ఉండేట్టులా క‌మ‌ల్ త‌న లోగోను ఆవిష్క‌రించారు. ఇక ప‌వ‌న్ లోగోలో కేవ‌లం ఎరుపు, తెలుపు రంగులు మాత్ర‌మే క‌నిపిస్తుండ‌గా, అందుకు కాస్తంత భిన్నంగా ఎరుపు, తెలుపుల‌తో పాటుగా న‌క్ష‌త్రం బ్యాక్ గ్రౌండ్ గా న‌లుపు రంగుకు కూడా క‌మ‌ల్ త‌న పార్టీ లోగోలో స్థానం క‌ల్పించారు. ఇక వ్య‌వ‌హార స‌ర‌ళి చూసినా... ప‌వ‌న్‌, క‌మ‌ల్‌ల మ‌ధ్య పోలిక‌లు క‌నిపిస్తున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. వామ‌ప‌క్ష భావాల‌నే బ‌య‌ట‌పెట్టేస్తున్న ప‌వ‌న్‌... త‌న‌కు ఉద్య‌మ నాయ‌కుడు చెగువేరా అంటే ఇష్ట‌మ‌ని, ఆయ‌న బాట‌లోనే తాను న‌డుస్తాన‌ని ప‌వ‌న్ చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా క‌మ్యూనిస్టు నేత‌లా ఫోజు కొడుతూ వామ‌ప‌క్ష నేత‌ల‌ను కీర్తించ‌డంతో... ఆయ‌న కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాట‌లోనే ప‌య‌నిస్తున్న‌ట్లుగా భావించక త‌ప్ప‌దు.