Begin typing your search above and press return to search.

పెరియార్ లాగానే పగ్గాలు అందుకున్న కమల్!

By:  Tupaki Desk   |   22 Feb 2018 12:02 PM GMT
పెరియార్ లాగానే పగ్గాలు అందుకున్న కమల్!
X
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా.. ఉత్తరాది నాయకుల దురహంకార పూరిత ఆధిపత్యంపై ఈ దేశంలో ఇంచుమించు శతాబ్దకాలపు పోరాటం ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి.. ఉత్తరాది నాయకుల పెత్తనాన్ని ద్రవిడ గొంతుకలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల నాయకులు వేర్వేరు ఎజెండాలతో ఉత్తరాది పెత్తనపు పార్టీలతో రాజీ పడినప్పటికీ.. ప్రత్యేకించి.. తమిళనాడు కేంద్రంగా పుట్టిన వర్ధిల్లుతున్న ద్రవడ పార్టీలు.. మాత్రం వారికి మింగుడు పడలేదు. ఆ రకంగా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి.. తానే సమైక్యస్వరంగా స్వాతంత్రోద్యమ చరిత్ర కాలం నుంచి నిలిచిన నాయకుడు పెరియార్! దేశంలో తమిళరాజకీయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ పెరియార్ (పెద్దాయన) అని గౌరవంగా పిలుచుకునే ఈ.వి. రామస్వామి.

ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత.. ఇప్పుడు ‘విశ్వనాయకుడు’ కమల్ హాసన్ కూడా.. దక్షిణాది ఆరు రాష్ట్రాల కు సంబంధించిన నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావడానికి ఆయన చూస్తున్నారు. కమల్ ఇప్పటిదాకా తన పార్టీ రాజకీయ విధానం ఎలా ఉండబోతున్నది.. ఎవరితో మైత్రి, ఎవరితో శతృత్వం కొనసాగిస్తుంది అనే విషయంలో పెద్దగా వివరాలు ఏమీ చెప్పలేదు. కానీ రెండు అంశాల్లో మాత్రమే ఆయన క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నా డీఎంకే వ్యతిరేకతను స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ దళంలో మాత్రం చేరబోయేది లేదని తేల్చేశారు. కానీ ఆయన అంతరంగంలో మోడీ దక్షిణాది రాష్ట్రాలకు చేస్తున్న ద్రోహం కూడా పార్టీ ఎజెండాగానే సెట్ అయి ఉన్నదని.. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత గానీ అర్థం కాలేదు.

కమల్ పార్టీ జెండాలో పెనవేసుకున్న ఆరు చేతులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ఆరు చేతులు.. ఆరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీక అని ఆయన చెబుతున్నారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి కలిపి ఆయన ఒక యూనిట్ గాను.. తాను రాజకీయ పోరాటం సాగించడానికి వేదికగా భావిస్తున్నారన్నమాట.

తమిళనాడు తొలినుంచి ఉత్తరాది పెత్తనాన్ని ప్రతి విషయంలోనూ వ్యతిరేకిస్తూనే ఉంది. చివరికి ఉత్తరాది వారి సొంతమైన హిందీని జాతీయ భాషగా చేసినప్పటికీ.. భాషా వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపి.. తమ రాష్ట్రంలో ఆ భాష ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ఘనత తమిళులదే.

అలాగేఇప్పుడు కమల్ హాసన్.. దక్షిణాది రాష్ట్రాలకు ఐక్య వేదికగా తన పార్టీని తీర్చిదిద్ది... దక్షిణాది హక్కులు అనే ఎజెండాతో ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పార్టీల మద్దతును కూడా కూడగట్టుకుంటూ ఉత్తరాది వారు, ప్రత్యేకించి మోడీ దళంపై పోరాటం ప్రకటిస్తాడని అర్థమవుతోంది.