Begin typing your search above and press return to search.

కేసీఆర్ - హరీష్.. ఓ సస్యశ్యామలం కథ..

By:  Tupaki Desk   |   22 July 2018 4:12 AM GMT
కేసీఆర్ - హరీష్.. ఓ సస్యశ్యామలం కథ..
X
అంతా బాగుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్న కేసీఆర్ ఆశయం గొప్పదే.. గోదావరి నదిలో నీటిలభ్యతను గుర్తించి కేసీఆర్ చేపట్టిన ఈ ప్రాజెక్టు చారిత్రాత్మకమైనదే.. గోదావరి నదిని పరిశీలిస్తే... నదిపైన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చుక్క నీరు రావడం లేదు. తెలంగాణలో వర్షాలు కురిసినా ఆ ప్రవాహం శ్రీరాంసాగర్ లోకి వెళ్లదు. దీంతో దాదాపు 90 టీఎంసీల ప్రాజెక్టు తెలంగాణ అవసరాలను తీర్చేలా కనిపించడం లేదు. గోదావరిలో పైనున్న మహారాష్ట్ర నుంచి వరద వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఆదిలాబాద్ - దాని చుట్టుపక్కల మహారాష్ట్ర - చత్తీస్ ఘడ్ అడవుల్లో కురిసిన వర్షాలే తెలంగాణకు జీవనాధారం అయ్యాయి. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నదిలో ఎండాకాలం తప్పితే సంవత్సరమంతా నీటి ప్రవాహం ఉంటుంది. వానాకాలం అయితే ఉదృతంగా నీరు ప్రవహిస్తుంటుంది. అందుకే ఈ ప్రాణహిత నదిని బేస్ చేసుకొనే కేసీఆర్ బాగా ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.. ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పూనుకున్నారు.. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది.

తెలంగాణ సస్యశ్యామలంలో కాళేశ్వరం కీలకం.. నో డౌట్ కానీ.. ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు.. వినియోగం విషయంలో అందరిలోనూ డౌట్ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఎప్పుడూ దీన్నే విమర్శిస్తుంటాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదట కాళేశ్వరం నుంచి నీటిని మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన ప్రాజెక్టు ఇదీ.. 20 టీఎంసీల ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి అనంతరం ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీ పూర్ లోని కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీలోకి నీళ్లను ఎత్తిపోస్తారు. ఇక అక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ సరిహద్దుల్లో ఉన్న మిడ్ మానేరును నింపుతారు.. ఇక్కడి నుంచి మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం మీదుగా మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తారు. ప్రస్తుతానికి మిడ్ మానేరు వరకూ నీళ్లు వచ్చేందుకు కాలువలు పూర్తయ్యాయి. మల్లన్నసాగర్ కు తరలించేందుకు కాలువల పనులు కొనసాగుతున్నాయి.

ఇలా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వరూపం చూస్తే.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నది నీటిని మొదట కేటీఆర్ నియోజకవర్గ పరిధిలోని మిడ్ మానేరుకు.. అనంతరం హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం మీదుగా మెదక్ జిల్లాకు నీటిని తరలించబోతున్నారు. మధ్యలో తాగునీటికి మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు సాగునీరు ఇస్తారు. మెజార్టీ వాటా మాత్రం మెదక్ జిల్లాకే తీసుకుపోతున్నారు..

ప్రాజెక్టు ను పరిశీలిస్తే కేసీఆర్ సస్యశ్యామలం కాన్సెప్ట్ మొత్తం కేసీఆర్-హరీష్-కేటీఆర్ ల సొంత ప్రయోజనాల కోసమే మొదలుపెట్టారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా నీటి అవసరాలు తీర్చేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మధ్యలో ఎన్ని కాలువలు, సైడ్ ప్రాజెక్టులు కడుతున్నా... అంతిమంగా మెదక్ నీటి అవసరాలకే ఈ ప్రాజెక్టు అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం కంటే కేసీఆర్, హరీష్ ల సొంతజిల్లా మెదక్ కే ఎక్కువ ప్రయోజనమని ఆడిపోసుకుంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ ‘సస్యశ్యామలం’ కథ ఇంకెంత ఇంట్రస్టింగ్ గా ఉంటుందో..