Begin typing your search above and press return to search.

కాళేశ్వరం వెలుగుల కింద చీకటి!

By:  Tupaki Desk   |   20 Jun 2019 5:12 AM GMT
కాళేశ్వరం వెలుగుల కింద చీకటి!
X
కాళేశ్వరం.. తెలంగాణ కరువు తీర్చే అతిపెద్ద బహుళార్ధక సాదక ప్రాజెక్టు.. పల్లమెరుగే గోదావరి నదిని అందుకు రివర్స్ గా పైకి తీసుకెళ్లే మహత్తర ఘట్టం.. దాదాపు అర కిలోమీటర్ ఎత్తుకు కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిగా తీసుకెళుతున్నాడు.

ఈరోజు దినపత్రికలన్నింటిలో ఆ ప్రాజెక్టు గొప్పతనం.. తెలంగాణ కరువు తీర్చే ప్రాజెక్టు.. గొప్ప ప్రాజెక్టుగా అందరూ కీర్తిస్తున్నా.. దీపం కింద చీకటిలా.. కాళేశ్వరం వెలుగుల కింద కూడా కొన్ని వందల కుటుంబాల త్యాగం ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మునిగిపోయి నిర్వాసితులుగా మారిన చాలా మందికి ఇంకా పునరావాసం.. నష్టపరిహారం అందక ఆయా జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలుపుతున్నారు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వరకు నీటిని తీసుకెళుతున్నారు. ఇందుకోసం మధ్యలో వివిధ ప్రాజెక్టులను నింపనున్నారు. పంప్ హౌస్ ద్వారా కాళేశ్వరం నుంచి లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచి అటు ఎస్పారెస్పీకి.. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరును నింపనున్నారు..

అయితే కాళేశ్వరం నీటికోసమే గత టీఆర్ ఎస్ సర్కారులో వైఎస్ హయాంలో మొదలుపెట్టి వదిలేసిన మిడ్ మానేరు ప్రాజెక్టును ఆగమేఘాల మీద పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులో అప్పటిదాకా కళకళలాడిన 11 గ్రామాలు మునిగిపోయాయి. వారిని వేములవాడ మండలంలో పునారవాసం కల్పించారు. అక్కడ కనీస వసతులు లేవు. నష్టపరిహారం తక్కువే. ఇప్పటికే చాలా మంది గ్రామస్థులకు పరిహారం అందక రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట నష్టపరిహారం కోసం ఆందోళన చేస్తున్నాడు.

ఇక కాళేశ్వరంలో మిడ్ మానేరు నుంచి మెదక్ జిల్లా మల్లన్న సాగర్ ను నింపుతారు. అస్సలు ఇక్కడ ప్రాజెక్టే లేదు.కానీ కాళేశ్వరం కోసమే కడుతున్నారు. ఆ ప్రాజెక్టు కింద కూడా పది గ్రామాలు మునిగిపోతున్నాయి. వాళ్లకు పరిహారం విషయంలో ఇప్పటికీ ఆందోళనలు జరుగుతున్నాయి. వాళ్లకు కోదండరాం సహా ప్రతిపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. అయితే ప్రభుత్వం పరిహారంతోపాటు పునరావాసం కల్పించినా కన్న ఊరును వదల్లేక.. కొత్త ఊళ్లో వసతులు లేక ఆ నిర్వాసితులు నరకయాతన పడుతున్నారు.

తెలంగాణ ప్రగతికి ప్రాజెక్టులు అవసరం.. ఆ నీటిని అందరూ వాడేందుకు సహ ప్రాజెక్టులు అవసరం. అయితే ఆ ప్రాజెక్టుల్లో మునిగిపోయే త్యాగధనులను ప్రభుత్వం కడుపునపెట్టుకున్నప్పుడే ఆ వెలుగులను వాళ్లు కూడా పొందుతారు. లేదంటే వారి శోకం మనకు ఆనందంగా మిగిలితే ఎవరికీ సంతోషంగా ఉండదు. సో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగినప్పుడే ఈ పథకం అసలు లక్ష్యం నెరవేరినట్టు..