Begin typing your search above and press return to search.

జగన్ దెబ్బకు బ్యాలెన్స్ మిస్ అయిన తమ్ముడు

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:49 PM GMT
జగన్ దెబ్బకు బ్యాలెన్స్ మిస్ అయిన తమ్ముడు
X
పొగుడుతంటే ఎంత ఆనందంగా ఉంటుందో.. తిడుతుంటే పడటం అంత కష్టంగా ఉంటుంది. అందులోకి అధికారంలో ఉన్న వేళ.. విపక్ష నేత అధికారపక్ష నేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడితే అధికారపక్ష నేతలు జీర్ణించుకోవటం కష్టమే. ఏపీ ముఖ్యమంత్రిపైనా.. ఆయన పాలన మీద ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ ఓ రేంజ్లో విరుచుకుపడిన వైనం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్ని సందర్శించిన జగన్.. ఆ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు.

ఈ మధ్య కాలంలో జగన్ ఇంత ఆవేశంగా మాటల దాడి చేసింది ఇదేనని చెప్పొచ్చు. విపక్ష నేత ఫైరింగ్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ చెలరేగిపోయారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతపై మండిపడుతూ.. విమర్శలు చేసే ముందు పలు విషయాలు తెలుసుకోవాలన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. నోటితో చెప్పలేనంత దారుణమైన భాషను వాడుతున్నట్లుగా చెప్పిన కళా.. వ్యక్తిగత విమర్శలు చేశారు.

‘‘నువ్వెంత.. నీ వయసెంత? నువ్వో ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యావ్. నీ భాష చూస్తేనే నువ్వు ఎలాంటివాడివో అర్థమవుతుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. వరద ప్రాంతాల్లో అన్ని చర్యలు తీసుకున్నాం. జగన్ మనసు మొత్తం బురదతో నిండిపోయింది. జగన్ విపక్ష నేతగా పూర్తిగా విఫలమయ్యారు. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి’’ అంటూ మండిపడ్డారు. అవగాహనతో వ్యాఖ్యలు చేయాలని.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న కళా.. వరద సహయక చర్యలపై ఏపీ సర్కారు పనితీరుపై సంతృప్తి వ్యక్తమవుతున్నట్లు వ్యాఖ్యానించారు.

కళా వెంకట్రావ్ ఫీలైనట్లుగా జగన్ తీవ్రస్థాయిలో తిట్టేశారని అనుకుందాం. పెద్ద మనిషిగా వ్యవహరించాల్సిన కళా.. అందుకు భిన్నంగా పిల్లాడిలా ఫైర్ కావటం ఏమిటి? అనుభవం గురించి మాట్లాడుతున్న ఆయన నోటి నుంచి అనుభవ లేమి రీతిలో మాటలు ఎందుకు వచ్చినట్లు? అన్నది ఒక ప్రశ్న. గౌరవించలేదని ఆవేశపడే కళా.. తానుకూడా గౌరవంగా వ్యవహరించాలన్న విషయాన్ని మర్చిపోవటం గమనార్హం.