Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లి..కడియం ఎంతలా దగ్గరయ్యారంటే..

By:  Tupaki Desk   |   24 July 2016 6:31 AM GMT
ఎర్రబెల్లి..కడియం ఎంతలా దగ్గరయ్యారంటే..
X
ఒకే జిల్లాకు చెందిన ప్రముఖ నేతలిద్దరూ కలిసి ఉండటం.. సఖ్యంగా ఉండటం దాదాపుగా కనిపించదు. ఇక.. ఒకే పార్టీకి చెందిన వారైతే అధిప్యత పోరు జోరుగా ఉంటుంది. ఇక.. గతంలో కత్తులు నూరుకున్న నేతల మధ్య స్నేహం వెల్లివిరియటం సాధ్యమే కాదు. కానీ.. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోనిఒకే మండలానికి చెందిన కడియం శ్రీహరి.. ఎర్రబెల్లి దయాకర్ రావుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. రాజకీయాల్లో తలపండిన వీరిద్దరూ కొద్ది కాలం క్రితం ఒకరు టీఆర్ఎస్ లో.. మరొకరు తెలుగుదేశంలో ఉన్న సంగతి తెలిసిందే.

మారిన రాజకీయ పరిస్థతుల్లో కాస్త ఆలస్యంగా ఎర్రబెల్లి గులాబీ కారు ఎక్కేసిన విషయం తెలిసిందే. ఎర్రబెల్లి కారు ఎక్కక ముందే ఇరువురు నేతల మధ్య మాటల దాడితో పాటు.. కార్యకర్తల మధ్య పరస్పర దాడుల వరకూ వ్యవహారం ఉండేది. ఒకరిపై ఒకరు విమర్శలు.. కేసులు పెట్టుకోవటం లాంటివి రోటీన్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఉప్పు.. నిప్పులా ఉండే వీరిద్దరి మధ్య ఉన్నట్లుండి వెల్లి విరిస్తున్న అనుబంధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ మద్యనేవీరిద్దరూ అమెరికాకు వెళ్లటం.. అక్కడ వీరి మధ్య మాటలు కుదరటం.. ఒకరి మధ్య ఒకరికి ఉన్న దూరం తగ్గిపోవటంతో పాటు.. అపోహలు చెరిగిపోయి.. అనుబంధం బిల్డ్ అయ్యే పరిస్థితి. ఇదెంత వరకూ వెళ్లిందంటే.. ఎర్రబెల్లి కోరిన వెంటనే పాఠశాల అభివృద్ధి పనుల కోసం రూ.22 కోట్లు అడిగితే ఓకే అనేశారు.

ఇక.. అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఇరువురు నేతలు ఒకరినిఒకరు పొగుడుకోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అబివృద్ధి కోసం ఎర్రబెల్లి పట్టుదలతో ముందుకు వెళతారని కడియం పొగిడితే.. తాను సైతం ఏం తక్కువ తినలేదన్నట్లుగా.. ఏ మంత్రి పదవి ఇచ్చినా.. కడియం సమర్థంగా విధులు నిర్వహిస్తారంటూ ఎర్రబెల్లి పొగిడేశారు. అంతేనా.. ఇరువురు నేతలు తాజాగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో కొసరి కొసరి వడ్డించుకోవటం.. క్లోజ్ గా మూవ్ కావటం చూసినప్పుడు .. రాజకీయాల్లో శాశ్విత శత్రుత్వం.. శాశ్విత మిత్రత్వం ఉండదన్న విషయం మరోసారి బోధ పడకమానదని చెప్పక తప్పదు.