Begin typing your search above and press return to search.

క‌డియం తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావ‌ట‌!

By:  Tupaki Desk   |   19 Oct 2018 4:52 AM GMT
క‌డియం తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావ‌ట‌!
X
ఎంత చెట్టుకు అంత గాలి అని ఊరికే అన‌లేదు. తాజా వ్య‌వ‌హారం గురించి తెలిస్తే.. ఇదే మాట గుర్తుకు వ‌స్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించి.. సీఎం కేసీఆర్‌ కు అత్యంత స‌న్నిహితుడ‌న్న పేరు ప్ర‌ఖ్యాతుల‌తో పాటు.. కావాల్సినంత ప‌వ‌రు చేతిలో ఉన్న నేత‌కు క‌ష్టం ఏం ఉంటుంద‌ని ఎవ‌రైనా అంటారు.

కానీ.. తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి క‌ష్టాలు తెలిస్తే అయ్యో పాపం అనాల్సిందే. త‌మ త‌ర్వాత‌.. త‌మ రాజ‌కీయ వార‌సులుగా కుటుంబ స‌భ్యుల్ని ఎంచుకోవ‌టం కొత్త విష‌య‌మేమీ కాదు.

రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తె.. క‌డియం కావ్య రాజ‌కీయాల్లో త‌న తండ్రి మాదిరే చ‌ట్ట‌స‌భ‌లో కూర్చోవాల‌ని త‌పిస్తున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే గ‌డిచిన రెండేళ్లుగా ప్లాట్ ఫాంను సిద్ధం చేసుకున్నారు. తండ్రి స‌ల‌హాతో ఆమె.. స్టేష‌న్ ఘ‌న్ పూర్ మీద దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ ద‌గ్గ‌ర త‌న తండ్రికి ఉన్న సంబంధంతో ఈసారి ఎన్నిక‌ల్లో తాను త‌ప్ప‌క ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతాన‌ని ఆమె ఆశించారు.

అయితే.. ఆమె ఆశ‌ల‌కు చెక్ చెబుతూ.. ఆమె కోరుకున్న స్టేష‌న్ ఘ‌న్ పూర్ కు పార్టీ నేత‌.. గ‌తంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేసి త‌ర్వాత తొల‌గించిన రాజ‌య్య‌ను పార్టీ అభ్య‌ర్థిగా కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ప్ర‌క‌ట‌న చేశారు. తాను కోరుకున్న సీటును త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి రాజ‌య్య‌కు కేటాయించ‌టంపై క‌డియం కావ్య తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

త‌న తండ్రికి ఉన్న రాజ‌కీయ అనుభ‌వంతో కేసీఆర్ మ‌న‌సు మారేలా కొన్ని ప్ర‌య‌త్నాల్ని క‌డియం చేసిన‌ట్లుగా చెబుతారు. అయినా.. వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌టంతో.. కుమార్తెకు టికెట్ ఇచ్చేందుకు నో అంటే పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగింది. అయిన‌ప్ప‌టికీ కేటీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌టం హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ తీరుతో గుర్రుగా ఉన్న క‌డియం.. అధినేత‌తో పేచీ పెట్టుకునే సాహ‌సం చేయ‌లేదంటున్నారు. ఈ కార‌ణంతోనే తాను పార్టీ మారుతున్న‌ట్లుగా సాగుతున్న ప్ర‌చారానికి తెర దించుతూ.. గులాబీ కారులోనే ప్ర‌యాణిస్తాన‌న్న క్లారిటీ ఇచ్చారు.

త‌న‌పై మీడియాలో వ‌స్తున్న వార్త‌లు స‌రికావంటూ చెప్పిన క‌డియం ప‌రిస్థితి ఇంట్లో దారుణంగా ఉందంటున్నారు. అదే స‌మ‌యంలో.. కేసీఆర్ ద‌గ్గ‌ర ఆయ‌న‌కున్ని ఇమేజ్ డ్యామేజ్ అయ్యింద‌న్న మాట వినిపిస్తోంది. తాను కోరుకున్న‌ట్లుగా కేసీఆర్ చేత టికెట్ ఇప్పించ‌టంలో తండ్రి ఫెయిల్ కావ‌టంపై కావ్య ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. అవ‌స‌ర‌మైతే ఇండిపెండెంట్ గా పోటీకి రెఢీ అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రోవైపు.. త‌న కుమార్తెకు టికెట్ ఇప్పించుకునే విష‌యంలో త‌న‌పై ఎన్ని విధాలుగా ఒత్తిళ్లు తీసుకురావాలో అన్ని విధాలుగా తీసుకొచ్చిన క‌డియం తీరుపై కేసీఆర్ గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌ద‌శ‌లో తన కుమారుడు కేటీఆర్ ను క‌డియం త‌న‌పైకి పంపిన తీరుతో ఆయ‌న సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

క‌డియం కుమార్తె టికెట్ విష‌యంలో త‌న‌పై ఒత్తిడిని పెంచ‌టానికి కేటీఆర్ ను పంపిన సంద‌ర్భంలో.. కొడుక్కి కేసీఆర్ క్లాస్ తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌రింత లాగితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌లో క‌డియం వెన‌క్కి త‌గ్గి.. త‌న మీద మీడియాలో సాగుతున్న ప్ర‌చారానికి పుల్ స్టాప్ పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రెండేళ్లుగా తాను క‌న్న క‌ల‌ల్ని వ‌మ్ము చేసేలా కేసీఆర్ నిర్ణ‌యం ఉండ‌టంపై కావ్య అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. త‌న‌కు టికెట్ రాద‌న్న విష‌యం తేలిపోయిన నేప‌థ్యంలో ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగితే ఎలా ఉంటుంద‌న్న అంశంపై క‌డియం కుమార్తె దృష్టి పెట్టిన‌ట్లుగా ఉంది. ఈ విష‌యంలో క‌డియం అటు కేసీఆర్‌కు చెప్ప‌లేక‌.. ఇటు కుమార్తెను స‌ర్దిచెప్ప‌లేక తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌ట్లు చెబుతున్నారు.