Begin typing your search above and press return to search.

బాబును మ‌ళ్లీ టార్గెట్ చేసిన సీనియ‌ర్ ఎంపీ

By:  Tupaki Desk   |   26 May 2016 5:22 AM GMT
బాబును మ‌ళ్లీ టార్గెట్ చేసిన సీనియ‌ర్ ఎంపీ
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా ప్ర‌తిప‌క్షాలు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఒకింత దూకుడుగా అడుగులు వేస్తోంది. ప్ర‌త్యేక హోదాపై గ‌ళం వినిపిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత - ఎంపీ కేవీపీ రామచందర్‌ రావు ఏపీ సీఎం చంద్రబాబును మ‌రోమారు టార్గెట్ చేశారు. ఈ ద‌ఫా మ‌రో లేఖ‌ను బాబుకు రాశారు.

ప్ర‌త్యేక హోదా సాధించేందుకు కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పని చేయాలని, మహానాడులో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కేవీపీ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు రాష్ట్రంలోని అధికార, విపక్షాలన్నీ కలిసి ఒక కార్యచరణను రూపొందించుకుని అమలు చేయవలసిన అవసరం ఉన్నదని కేవీపీ సూచించారు. ఈనెల 27నుంచి జరిగే మహానాడులో ‘బీజేపీతో పొత్తు కంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ముఖ్యమనేలా మీరొక రాజకీయ తీర్మానాన్ని ఆమోదింపజేసి, రాష్ట్ర విభజన చట్టం, రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు సత్వరం అమలు చేయించుకోలేకపోతే వచ్చే కష్టనష్టాలను మీ శ్రేణులకు అర్థమయ్యేలా చేసి వారిని కర్తవ్యోన్ముఖులను చేయాలి’ అని కేవీపీ లేఖ‌లో పేర్కొన్నారు. ‘నిర్దిష్ట గడువులో కేంద్రం మీద అవసరమైతే సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించేందుకు ఏ మాత్రం వెనుకాడకుండా మీ చతురత, ఢిల్లీలో చక్రం తిప్పగల సమర్థతను మీ కోసం, మీ మనుషుల కోసమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం కూడా వాడగలరనే సందేశం పంపేలా తగు చర్యలు చేపట్టాల’ని అని చంద్రబాబుకు కేవీపీ విజప్తి చేశారు.

ఇంతేకాకుండా బాబును ఇరుకున పెట్టే మ‌రో విష‌యాన్ని కేవీపీ ప్ర‌స్తావించారు. ‘ప్రత్యేక హోదా విషయంలో మీరు పలుమార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు, వారు వ్యక్తిగతంగా మీకు ఏం చెబుతున్నారో తెలియదు కానీ హోదా ఇవ్వలేమనే విషయాన్ని కేంద్ర మంత్రులు - బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు’ అంటూ బాబు భ్ర‌మ‌ల్లో ఉంచుతున్నార‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ఇప్పటికీ ప్రత్యేక హోదా సాధిస్తామనే చెబుతుండటం వల్ల ఈ విషయంలో ప్రజలు ఆయోమయానికి, ఆందోళనకు గురి అవుతున్నారని కేవీపీ చెప్పారు. రాజ్యసభలో తాను ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌ కు వచ్చే లోగా ఏపీకి చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఒక్క తాటిపైకి రావలసిన అనివార్య పరిస్థితి ఉందన్నారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి విభజన హామీల సాధన కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాలని కేవీపీ ప్రతిపాదించారు. విభజన చట్టం - రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు జరిగే వరకు రాష్ట్రంలోని అన్ని పక్షాలతో పరస్పర దూషణ విరమణ ఒప్పందం చేసుకోవాలని కేవీపీ ఏపీ సీఎంకు సలహా ఇచ్చారు.