Begin typing your search above and press return to search.

చంద్రబాబు మెడ చుట్టూ జల్లికట్టు

By:  Tupaki Desk   |   21 Jan 2017 11:35 AM GMT
చంద్రబాబు మెడ చుట్టూ జల్లికట్టు
X
తమిళనాట చిచ్చు రేపుతున్న జల్లికట్లు కేవలం ఆ రాష్ట్రంలోనే కాకుండా మిగతా చోట్లా రాజకీయ కాకను రేపుతోంది. జల్లి కట్లుకు అనుమతి సాధించడానికి తమిళులు చేస్తున్న పోరాటాల మాదిరి తామూ తమతమ రాష్ట్రాల్లో నిషేధించిన క్రీడల కోసం పోరాడతామంటూ మహారాష్ట్ర, అస్సోం నుంచి కేంద్రంపై ఒత్తిడి వస్తోంది. మరోవైపు తమిళనాట చూపుతున్న ఈ క్రీడాస్ఫూర్తిని ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలోనూ అందిపుచ్చుకోవాలని తెలుగు నేతలు అంటున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేసి డిమాండ్లు చేస్తున్నారు. కేవలం ఒక సంప్రదాయ క్రీడ కోసమే పార్టీలకు అతీతంగా ప్రజలు - నేతలు సంఘటితమవుతున్నారని.. అలాంటిది విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడంలో పాలక టీడీపీ ఎందుకు వెనుకాడుతోందన్న ప్రశ్నలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ - ప్రత్యేక హోదా పోరాట యోధుడు కేవీపీ రామచంద్రరావు దీనిపై నేరుగా చంద్రబాబుకే లేఖ రాశారు. తమిళులను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నట్లుగా ఆయన చంద్రబాబుకు చురుకుపుట్టేలా లేఖాస్త్రం సంధించారు.

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజనకు ముందే అప్పటి యూపీఏ ప్రతిపాదన చేసినా దాన్ని విభజన చట్టంలో పొందుపరచలేదు. దీంతో అది కార్యరూపం దాల్చడానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు విభజన నాటికి ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ కూడా అప్పట్లో ఆ డిమాండును సమర్థించింది. వెంకయ్యనాయుడు వంటి ఆ పార్టీ నేతలైతే అయిదేళ్లు కాదు పదేళ్ల పాటు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ గొంతు చించుకున్నారు. కానీ... బీజేపీ కేంద్రంలోని అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చింది. ప్రధాని మోడీ ససేమిరా అన్నారు. నిబంధనలు అంగీకరించవన్నారు... మిగతా రాష్ట్రాలు కూడా డిమాండు చేసే ప్రమాదం ఉందని సాకులు చెప్పారు. మొత్తానికి మోడీ మనసులో ప్రత్యేక హోదా లేదని తేలిపోవడంతో వెంకయ్య వంటి నేతల గళాలన్నీ మూతపడిపోయాయి.

మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా... నవ్యాంధ్రలో బీజేపీని కలిసి పాలిస్తున్న పార్టీగా ఉన్న టీడీపీ ఆది నుంచి ఈ విషయంలో కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోయింది. అయితే... కొద్దినెలల కిందట నవ్యాంధ్రలోని ప్రతిపక్షాలన్నీ ప్రత్యేక హోదా డిమాండ్ తో ప్రజల్లోకి వెళ్లడం.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డిమాండ్ ను ఎత్తుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రత్యేక హోదాపై మొహమాటంగానైనా స్వరం పెంచారు. దీంతో కేంద్రం.. ఒకింత మెత్తబడి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధపడింది. ఆ మాత్రం తాయిళానికే చంద్రబాబు కూల్ అయిపోయి ప్రత్యేక హోదా అన్న మాటను తన డిక్షనరీ నుంచి తొలగించేశారు. అయితే... ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం అడపాదడపా ఇంకా ప్రత్యేక హోదా గళం వినిపిస్తున్నారు. టీడీపీ తన నోటి బలంతో అది వినిపించకుండా అడ్డుకుంటోంది. ఇలా మొత్తానికే ప్రత్యేక హోదా అంశం దాదాపుగా సద్దుమణిగిపోయిన దశలో తమిళనాట జల్లికట్టు అలజడి రేగడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని రైజ్ చేశారు. జల్లికట్టు విషయంలో తమిళులు చూపుతున్న పోరాట పటిమను ప్రత్యేక హోదా విషయంలో మన చేతకానితనాన్ని పోల్చుతూ పోస్టింగులతో వీర విహారం చేస్తున్నారు. దీంతో నవ్యాంధ్రలోని విపక్ష నేతలూ మళ్లీ ప్రత్యేక హోదా గళమెత్తారు. అందులో భాగంగానే తాజాగా కేవీపీ రామచంద్రరావు దీనిపై స్పందించాలంటూ చంద్రబాబుకు లేఖరాశారు.

కాగా కేవీపీ ఈ లేఖ రాయడంతో దానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా పోరాడిన వ్యక్తి ఎవరని అడిగితే కేవీపీ పేరే చెప్పాల్సి ఉంటుంది. ఆయన పార్లమెంటులో దీనికోసం ప్రయివేటు మెంబర్ బిల్లు కూడా పెట్టి పోరాడారు. కేంద్రం ససేమిరా అనడం.. నవ్యాంధ్ర ప్రభుత్వం నోరు మూసుకోవడంతో ఈ పోరాటాలన్నీ వృథా ప్రయాసలుగానే మిగిలిపోయాయి. కానీ, ఇప్పుడు తమిళనాట పరిస్థితులను చూసి ప్రజలు డిజిటల్ వేదికలపై దీనిపై స్పందిస్తుండడం.. విపక్ష నేతలు ఒత్తిడి చేస్తుండడంతో సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనైనా ఆయనకు చురుకుపుడుతుందో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/