Begin typing your search above and press return to search.

బీజేపీ మోసం..బాబు విందు రాజ‌కీయం

By:  Tupaki Desk   |   25 May 2017 4:26 PM GMT
బీజేపీ మోసం..బాబు విందు రాజ‌కీయం
X
బీజేపీ-టీడీపీల పొత్తు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ద‌క్కుతున్న ప్ర‌యోజ‌నాల‌పై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా మీడియాతో కేవీపీ మాట్లాడుతూ బీజేపీ దగాకోరు రాజకీయాలు చేస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి మోడీ తీరని అన్యాయం చేశారన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ పంచ‌న చేరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మంటగలుపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టిన చంద్ర‌బాబు విందు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కేవీపీ మండిప‌డ్డారు.

ఏపీ కోసం ఎంతో చేస్తున్నాన‌ని చెప్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై నిజ‌మైన చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి వైదొలిగి పోరాడాలని కేవీపీ రామ‌చంద్ర‌రావు అన్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు ఎందుకు రాజీ ప‌డ్డార‌ని కేవీపీ నిల‌దీశారు. ప్రత్యేక హోదా కోసం త‌మ నాయ‌కుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాడుతామ‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు అన్యాయం చేసిన‌ టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడుతున్నాయని కేవీపీ వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా....ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఏపీ హక్కే కాదు ప్ర‌జ‌ల సొత్తు అని నినదించారు. హోదాపై ప్రజలకు భరోసా ఇచ్చేందుకే భీమవరంలో ర్యాలీ చేపడుతున్నామని ప్ర‌క‌టించారు. జూన్‌ 4న జరిపే ఈ ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరువుతారని, హోదాకు కట్టుబడిన అన్ని పార్టీలను ర్యాలీకి ఆహ్వానిస్తామని ర‌ఘువీరారెడ్డి తెలిపారు. ఏపీ భూసేకరణ చట్టంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని, ప్రజలకు నష్టం కలిగించే భూసేకరణ చట్టాన్ని తిరస్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/