Begin typing your search above and press return to search.

నావతో పాటు మునగకుండా బాబు ముందుజాగ్రత్త

By:  Tupaki Desk   |   24 Feb 2018 12:02 PM GMT
నావతో పాటు మునగకుండా బాబు ముందుజాగ్రత్త
X
‘‘సముద్రంలో ప్రయాణిస్తున్న నావకు చిల్లు పడి నీళ్లు లోపలకు వస్తుంటే గనుక.. ఆ సంగతి ముందుగా గుర్తించే ఎలుక ఏదో ఒక విధంగా బయటపడే మార్గాలను అన్వేషిస్తుంది. అదే తరహాలో.. చంద్రబాబునాయుడు కూడా.. భాజపా అనే నౌక మునిగిపోనున్నదని ముందుగా గుర్తించి.. ఆ కూటమిలోంచి బయటపడడానికి మార్గాలు వెతుకుతున్నారు.. తొందరపడుతున్నారు..’’ అంటున్నారు కేవీపీ రామచంద్ర రావు.

రాష్ట్రంనుంచి తన పార్టీకి అటు లోక్ సభలో అస్తిత్వంలేకపోయినా.. రాజ్యసభలో సరైన బలం లేకపోయినా.. తొలినుంచి ప్రత్యేకహోదా డిమాండును వినిపిస్తూ పదేపదే ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ఒంటరిగా పోరాడుతూ వచ్చిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. ఇప్పుడు కేంద్రంలోని భాజపా రాష్ట్రానికి దక్కవలసిన హామీల విషయంలో ఎలాంటి సాయమూ చేయలేదని ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబునాయుడు గురించి ఆయన భిన్నమైన భాష్యం చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఈ దేశంలో త్వరలోనే మునగడానికి సిద్ధంగా ఉన్న నౌక లాంటిదని కేవీపీ అంటున్నారు. అదే నౌకలో ప్రయాణిస్తూ.. అది మునిగిపోనున్నదని అందరికంటెముందుగా చంద్రబాబునాయుడు గుర్తించారనేది ఆయన మాట. ఓ మీడియా గ్రూపునకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ ఈ విషయం ప్రకటించారు.

కేవీపీ విశ్లేషణ ప్రకారం.. గుజరాత్ లో బలం తగ్గిపోయి గట్టున పడ్డ భాజపా విజయం, తర్వాత రాజస్తాన్ ఎంపీ ఎన్నికల్లో సిటింగ్ సీట్లను కూడా కోల్పోయిన పరాజయాలు వీటన్నింటినీ గమనించిన తర్వాత.. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వీస్తున్న గాలులను చంద్రబాబునాయుడు అందరికంటె ముందుగా గుర్తించారుట. అందుకే ఈ కూటమినుంచి బయటకు వెళ్లాలని చూస్తున్నారట. ...కాకపోతే, చంద్రబాబునాయుడు తాను బయటకు పోతూ పోతూ.. మరికొన్ని నిందలు, గుదిబండలు ఆ నౌకమీద వేసి వెళ్లాలని అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో కేంద్రంతో రాజీపడిపోయి - ప్యాకేజీకి ఒప్పుకున్నారని కేవీపీ ఆరోపిస్తున్నారు.

ట్విస్టు ఏంటంటే.. కేవీపీ - తన సహచరుడైన వైఎస్‌ ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శిస్తున్నారు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. వైఎస్ జీవించి ఉంటే. ఎప్పటికీ కాంగ్రెస్ ను వీడే వాడు కాదని.. పార్టీ పట్ల ఆయన విధేయత అలాంటిదని కేవీపీ చెబుతున్నారు.