Begin typing your search above and press return to search.

కేవీపీ బిల్లుకు మోక్షం ఎపుడో తెలుసా?

By:  Tupaki Desk   |   23 July 2016 4:46 AM GMT
కేవీపీ బిల్లుకు మోక్షం ఎపుడో తెలుసా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌ రావు ప్రవేశ‌పెట్టిన‌ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఉత్కంఠ‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. అన్ని పార్టీల నేత‌లతో పాటు ఆంధ్రుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ బిల్లు ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ సభ్యుడు భగవంత్ సింగ్ మాన్ నిర్వాకం మూలంగా శుక్రవారం ఓటింగ్‌ కు రాలేదు. అయితే ఈ బిల్లు త‌ర్వాత ప‌రిస్థితి ఏంట‌నేది ఇపుడు స‌ర్వ‌త్ర ఆసక్తిక‌రంగా మారింది.

పార్ల‌మెంటు నిబంధ‌న‌ల ప్ర‌కారం కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు రెండు వారాల తరువాత మరోసారి రాజ్యసభ ముందుకు వస్తుంది. అయితే కేవీపీ ప్రతిపాదించిన ఈ బిల్లుపై రెండు వారాల తరువాత కూడా ఓటింగ్ జరుగుతుందా? అనేది అనుమానమే. అప్పుడు కూడా ఓటింగ్ జరగకపోతే ఇది మళ్లీ శీతాకాల సమావేశాల్లోనే పరిశీలనకు వస్తుంది. రాజ్యసభ అనేది నిరంతరం కాబట్టి ఈ సభకు సంబంధించిన ఏ బిల్లు కూడా మురిగిపోదు. అందుకే ఈ ప్రైవేటు బిల్లుపై ఏదోఒక రోజు రాజ్యసభలో ఓటింగ్ జరపక తప్పదు. తనంత తాను కేవీపీ ఈ బిల్లును ఉపసంహరించుకోనంత వరకు ఇది సభ పరిశీలనలో ఉంటుంది. ఆయన పట్టుబడితే ఓటింగ్ జరపక తప్పదు.

ఇదిలాఉండ‌గా ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన బిల్లు కాబట్టి దీనిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాహాటంగా వ్యతిరేకించదని చెప్తున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ దీనికి మద్దతివ్వక తప్పదని - రాజ‌కీయ‌ సిద్ధాంతాలు ప‌క్క‌న‌పెట్టి వైసీపీ సైతం బిల్లుకు మ‌ద్ద‌తిస్తుంద‌ని అంచ‌నా. ఇక కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి ఎలాగూ మ‌ద్ద‌తు దొర‌క‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో ఓటింగ్ జ‌రిగితే బిల్లు గెలిచే అవ‌కాశం ఉంటుందంటున్నారు.