కేటీఆర్ కు..ఆర్టీసీ మీద పిచ్చ కోపం వచ్చేసింది

Mon Apr 16 2018 12:58:54 GMT+0530 (IST)

మాటల విషయంలోనూ.. చేతల విషయంలోనూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆచితూచి అన్నట్లే వ్యవహరిస్తారు. ఎక్కడా టెంపర్ మెంట్స్ లూజ్ కారు. కొలత కొలిచినట్లుగా మాట్లాడే అలవాటున్న కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.ఆయన ట్విట్టర్ ఖాతాకు ఏదైనా ఇష్యూను తీసుకెళితే.. వెంటనే స్పందించటం ఆయనకు అలవాటు. తాజాగా అలానే రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో పైరసీ మూవీని వేయటంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ గరుడ బస్సులో నాని హీరోగా ఇటీవల రిలీజ్ అయిన కృష్ణార్జున యుద్ధం మూవీ పైరసీ సీడీని ప్లే చేశారు.

ఈ ఉదంతంపై బస్సులోని ప్రయాణికుడు ఒకరు మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక ప్రభుత్వ బస్సులోనే ఇలా పైరసీ సినిమాలు వేస్తూ.. సాధారణ ప్రజలకు పైరసీని నియంత్రించండంటూ చెప్పటం సమంజసమేనా? అని ప్రశ్నించారు.

దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ ఉదంతంలో ఆర్టీసీ సిబ్బంది చాలా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని మండిపడ్డారు.ఆర్టీసీ బస్సుల్లో మళ్లీ పైరసీ అనేది కన్పించకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ ఎండీని కోరారు. రాజుగారి అబ్బాయి అంత ఆగ్రహంగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత అమలు కాకుండా ఉంటుందా? అయినా.. పైరసీ సీడీనీ ప్రభుత్వ బస్సులో వేసేంత బరితెగింపు ఎలా సాధ్యమైందంటారు కేటీఆర్?