Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రవాసులకు ఇక మంచిరోజులు

By:  Tupaki Desk   |   28 July 2016 7:32 AM GMT
తెలంగాణ ప్రవాసులకు ఇక మంచిరోజులు
X
కేరళ - పంజాబ్ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం - వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వలసలు చాలాకాలంగా ఉన్నాయి. అందుకే ప్రవాసులకు సంబంధించిన వ్యవహారాలపై అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. అందుకు సంబంధించిన సమగ్ర విధానాలు రూపొందించుకున్నాయి. వారికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తుంటాయి. ఇకపై తెలంగాణలో ఆ రాష్ట్రాల కంటే మెరుగైన విధానాలు... మెరుగైన అమలు తీరు ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ రాష్ర్టం నుంచి విదేశాలకు వెళ్లే వారి సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఐటీ - మున్సిపల్ - పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం కేటీఆర్ ఎన్నారైలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. విదేశాలలో ఉపాధి - ఉద్యోగాల కోసం వెళ్తున్న వారిలో 10 శాతం మంది సమస్యలను ఎదుర్కుంటున్నారని చెప్పిన కేటీఆర్ ఎన్నారైల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 24 గంటలు పని చేసే హెల్ప్‌ లైన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య అధికంగా ఉండడంతో కేసీఆర్ ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఈ బాధ్యతలు భుజానికెత్తుకుని ప్రవాసుల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రవాసుల వ్యవహారాల్లో ద బెస్టు స్టేట్ గా నిలిపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లే సమాచారాన్ని నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రవాసుల సంక్షేమం కోసం కేటీఆర్ స్పష్టమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి అక్కడి చట్టాలపై పూర్తి అవగాహన కల్పించడం, విదేశాలలో బ్లాక్ లిస్టులో పెట్టిన కాలేజీల వివరాలను రాష్ట్రంలో అందుబాటులో ఉంచడం.. విదేశాలకు వెళ్లే వారికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ వంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడి వెనక్కి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ .. అలాగే అక్కడ ప్రమాదవశత్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ఏక్స్‌గ్రేషియావంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ తో చర్చించి ఫైనలైజ్ చేయబోతున్నారు. ప్రవాసుల వ్యవహారాల కోసం ఇంగ్లిషుతో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రత్యేక పోర్టల్‌ ను అందుబాటులోకి తేనున్నారు. గల్ఫ్‌ లోని తెలంగాణ వారికి వైద్య సేవలందించడానికి ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రవాసీ భారతీయ బీమా యోజన తదితర పథకాల అమలుపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ కేటీఆర్ చర్చించనున్నారు. మొత్తానికి కేటీఆర్ ఈ విషయంపై దృష్టి పెట్టారు కాబట్టి ప్రవాసులకు మంచిరోజులు వచ్చినట్లేననిపిస్తోంది.