Begin typing your search above and press return to search.

హైస్పీడ్ రైళ్ల‌పై మ‌న‌సు పారేసుకున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   16 Jan 2018 11:15 AM GMT
హైస్పీడ్ రైళ్ల‌పై మ‌న‌సు పారేసుకున్న కేటీఆర్‌
X
గంటలకు 300 కిలోమీటర్ల వేగం... అల‌స‌ట లేని ప్ర‌యాణం..హైస్పీడ్ రైళ్ల గురించి ఇవి ప‌రిచ‌య వ్యాఖ్య‌లు. ఈ రైళ్ల‌పై తెలంగాణ ఐటీ - ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మ‌న‌సు పారేసుకున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నకేటీఆర్ సియోల్ నుంచి డేగ్యూకు హైస్పీడ్ రైలులో ప్రయాణించారు. అనంత‌రం ఆయ‌న ఓ పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అద్భుత‌మైన వేగంతో ప్రయణించే హై స్పీడ్ రైళ్లు మనకూ కావాలని కోఆరు. వీటి వల్ల నగరాలు- పట్టణాలకు మద్య అంతరం తగ్గుతుందన్నారు.

కాగా మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా సాగుతోంది. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో 300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ సంస్థ ముందుకొచ్చింది. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హ్యుందాయ్‌ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్‌ వైస్ ప్రెసిడెంట్ నామ్ గ్యూహ్ నోతో సమావేశమైన ఆయన టీఎస్ ఐపాస్, అనుమతులకు ఏకగవాక్ష విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

హ్యూందాయ్‌ రోటెం గ్లోబల్ రైల్ సంచాలకులు కేకే యూన్‌తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రైల్వే ఉపకరణాల తయారీ, రక్షణ ఉత్పత్తుల్లో ఈ కంపెనీ కొరియాలో ప్రముఖమైనది. రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో రక్షణ పరిశ్రమకు ఉన్న అనుకూలతలను వివరించిన కేటీఆర్‌.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.కోఫోటి సంస్థ ఛైర్మన్ కిహుక్ సంగ్‌తో సమావేశమైన కేటీఆర్‌ ఆ కంపెనీ నెలకొల్పిన యంగ్ వన్ కార్పోరేషన్‌ను సందర్శించారు. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్‌కు చెందిన చోయ్ డాంగ్ జిన్‌ను కలిసిన కేటీఆర్… వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం, అసోసియేషన్ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు వివేక్, ఐటీ-పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ దక్షిణ కొరియాలో పర్యటనలో ఉన్నారు.