Begin typing your search above and press return to search.

బాబు, కేటీఆర్‌ ను ఆ అమెరిక‌న్ భ‌లే పొగిడేశారే!

By:  Tupaki Desk   |   26 May 2017 11:35 AM GMT
బాబు, కేటీఆర్‌ ను ఆ అమెరిక‌న్ భ‌లే పొగిడేశారే!
X
తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన ముఖ్య నాయకులు అమెరికా పర్యటనలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ నెల ప్ర‌థ‌మార్థంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమెరికాలో ప‌ర్య‌టించ‌గా...తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అగ్ర‌రాజ్యం టూర్‌ లో ఉన్నారు. ఈ ఇద్ద‌రు ముఖ్య నేత‌లు పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ కోస‌మే ప‌ర్య‌టిస్తున్నార‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే బాబు త‌న‌కు జాన్ జిగిరీ దోస్తు అని ప్ర‌క‌టించిన ప్ర‌ముఖుడితో కేటీఆర్ భేటీ అయ్యారు . అంతేకాదు పెట్టుబ‌డుల గురించి చ‌ర్చించారు. అత్యంత ఆస‌క్తిక‌రమైన అంశం ఏమిటంటే...తెలంగాణ‌లోని ప‌థ‌కాల‌ను, ప్ర‌భుత్వ ప‌నితీరును స‌ద‌రు వీఐపీ ప్ర‌శంసించార‌ని కేటీఆర్ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇంత‌కీ ఆ వీఐపీ ఎవ‌రంటే...సిస్కో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జాన్‌ ఛాంబర్స్‌.

త‌న అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీరంగం దిశ‌ను మార్చేసే ప్ర‌క‌ట‌న‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో పేరున్న సిస్కో వెలువ‌రించింద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఏపీలో త‌న కేంద్రాన్ని నెల‌కొల్పేందుకు సిస్కో ముందుకు వ‌చ్చిందని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. సిస్కో హెడ్ జాన్ ఛాంబర్స్ తో స‌మావేశం త‌న‌కు ప్ర‌త్యేక అనుభూతిని ఇచ్చిందని చంద్ర‌బాబు తెలిపారు. 1998లో తనతో కలిపి తీసుకున్న ఫొటోను జాన్ చాంబ‌ర్స్‌ చూపించారని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. జాన్ చాంబ‌ర్స్‌తో భేటీ అయిన సీఎం చంద్ర‌బాబు, చిన్న తరహా పరిశ్రమల్ని మరింత సరళతరం చేయడంలో సాంకేతిక సహాయం అందించాలని కోరార‌ని, అందుకు జాన్ అంగీక‌రించి అమ‌రావ‌తికి రానున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. క‌ట్ చేస్తే తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సిలికాన్ వ్యాలీలోని సిస్కో కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ జాన్ చాంబర్స్‌తో సమావేశమయ్యారు.

మంత్రి కేటీఆర్‌ కు అపూర్వమైన స్వాగతం పలికిన సిస్కో ఛైర్మన్ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మౌళిక వసతుల కల్పనపై ప్రశంసలు కురిపించారని మంత్రి కేటీఆర్ కార్యాల‌యం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, టీ హబ్ కార్యక్రమాలపై త‌న‌కు అవగాహన ఉందని జాన్ అన్న‌ట్లు వివ‌రించింది. ఈ సందర్భంగా చాంబర్స్ డిజిటలైజేషన్ మార్పులు, ప్రభావాలపైన ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన స్పందిస్తూ.. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వడంతో డిజిటల్ తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. డిజిటలైజేషన్ వలన ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. డిజిటలైజేషన్ ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు గ్రామీణ సమాజంలో మార్పులు సంభవిస్తాయన్నారు. వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా ఈ-హెల్త్, ఈ- ఎడ్యుకేషన్ రంగాల్లో ఘణ‌నీయమైన మార్పు వస్తుందని చెప్పారు. తెలంగాణలో టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్ నిర్మాణం చేసేందుకు సహకరిస్తామని జాన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా సిస్కో ఇండియా టీంను జాన్ చాంబర్స్ ఆదేశించారని ప్రక‌ట‌న వెలువ‌డింది. అంటే సిస్కో సీఈఓ చాన్ చాంబ‌ర్స్‌ను మ‌న తెలుగు రాష్ర్టాల ముఖ్య‌నేత‌లు క‌ల‌వ‌డం, వారితో ఆప్యాయంగా ముచ్చటించిన జాన్ రెండు రాష్ర్టాల‌తో ప‌నిచేస్తాన‌ని ఆస‌క్తి తెలిపారు అన్న‌మాట‌.

కొసమెరుపుః ఏపీకి వ‌స్తాన‌ని హామీ ఇచ్చిన‌, తెలంగాణతో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు ముందుకు సాగుతున్న సిస్కో సంస్థ....త‌న పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా 1,100 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. కీల‌క రంగాల‌పై దృష్టిసారించిన అంశంలో భాగంగా దాదాపు 5,500 ఉద్యోగుల‌ను లేదా మొత్తం ఉద్యోగుల్లో 7శాతం మందిని తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ ఒక‌టి వెల్ల‌డించింది.2016లో పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను వెల్ల‌డిస్తున్న స‌మ‌యంలో ఈ అంశాన్ని వెల్ల‌డించిన‌ట్లు స‌ద‌రు మీడియా క‌థ‌నం తెలిపింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/