Begin typing your search above and press return to search.

బాబుకు కేటీఆర్ డైరెక్ట్ వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   15 Dec 2018 11:02 AM GMT
బాబుకు కేటీఆర్ డైరెక్ట్ వార్నింగ్‌!
X
తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారాతో టీడీపీ - టీఆర్ ఎస్ మ‌ధ్య రాజుకున్న మాట‌ల యుద్ధం ఇంకా చ‌ల్లార‌డం లేదు. ఎన్నిక‌లు పూర్త‌యినప్ప‌టికీ ఇరు పార్టీల మ‌ధ్య వాతావ‌ర‌ణం ఇంకా వేడెక్కుతూనే ఉంది. స‌వాళ్లు - ప్ర‌తి స‌వాళ్లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కేటీఆర్ చంద్ర‌బాబుకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేశారు. ఏపీ రాజ‌కీయాల్లో టీఆర్ఎస్ జోక్యం అనివార్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ కేవలం నామమాత్రం పార్టీగా మిగిలిపోతుందని కేటీఆర్ అన్నారు. బీజేపీని బూచిగా చూపించి తన అసమర్ధతను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం కేసీఆర్ పనిచేస్తున్నార‌ని తెలిపారు. చంద్రబాబు మాత్రం దేశం కోసం కాకుండా తెలుగుదేశం ప్ర‌యోజ‌నాల‌ కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.

ఏపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు చంద్ర‌బాబుకు ఏమాత్రం అనుకూలంగా లేవ‌ని కేటీఆర్ చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో టీఆర్ ఎస్ కీల‌క పాత్ర పోషించాల‌నుకుంటున్న సంగ‌తిని గుర్తు చేశారు. దేశంలో అంత‌ర్భాగం కాబ‌ట్టి గులాబీ పార్టీ ఏపీలోనూ క‌చ్చితంగా జోక్యం చేసుకుంటుంద‌ని తెలిపారు. అక్క‌డి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై మాత్రం కేటీఆర్ ప్ర‌స్తుతానికి క్లారిటీ ఇవ్వ‌లేదు. పొత్తుల విష‌యాన్నీ ప్ర‌స్తావించ‌లేదు. ఏపీలో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీ గెల‌వాల‌నుకుంటున్న‌ట్లు మాత్రం చెప్పారు. ప్రత్యేక హోదా సాధ‌న‌ విషయంలో చంద్రబాబుకు బొత్తిగా క్లారిటీ లేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆయ‌న జాతీయ స్థాయి నేత కానే కాద‌ని పేర్కొన్నారు.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గానీ - బీజేపీ గానీ సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేవ‌ని కేటీఆర్ జోస్యం చెప్పారు. అప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని తెలిపారు. కాంగ్రెస్ - బీజేపీ యేత‌ర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వ‌స్తేగానీ మ‌నదేశంలో ప‌రిస్థితులు బాగుప‌డ‌వ‌ని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు.