కేటీఆర్ శకం స్టార్ట్ అయినట్టేనా?

Sun Dec 10 2017 21:00:01 GMT+0530 (IST)

తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో నూతన శకం మొదలవుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత - తెలంగాణ సీఎం ఇప్పటికీ కూడా ఫుల్ యాక్టివ్ గానే ఉన్నప్పటికీ... ఎందుకనో చాలా ముఖ్యమైన పనులన్నింటినీ ఆయన తన కుమారుడు తన కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగిస్తున్నారు. ఈ తరహా వైఖరి గత కొన్నాళ్లుగా జరుగుతున్నా... తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కే కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ తో పాటుగా కేసీఆర్ మేనల్లుడు - కేబినెట్ లో మరో కీలక మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు కూడా యాక్టివ్ గానే ఉన్నప్పటికీ... హరీశ్ రావు కంటే కూడా కేటీఆర్ కే మెజారిటీ బాధ్యతలు దఖలు పడుతున్న వైనంతో పాటుగా.. కేటీఆర్ కు క్రమంగా పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా... వచ్చే ఎన్నికల్లో కేటీఆరే మరింత క్రియాశీలంగానే కాకుండా... మొత్తం తానై నడిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ కు మొదటి నుంచి వెన్నంటి నడుస్తున్న హరీశ్ రావుతో కేటీఆర్ కు విభేదాలేమీ లేకున్నా కూడా పార్టీలో ఆధిపత్యం మాత్రం తనదేనన్న శైలిలో కేటీఆర్ చాలా వేగంగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి.అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్న హరీశ్ కూడా పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయని ప్రస్తుత తరుణంలో... వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ చక్రం తిప్పడం ఖాయమన్న వాదన మరింత బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న ఈ కీలక చర్య... సాంతం కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఆ విషయమేంటో?  దాని ద్వారా పార్టీలో నూతన శకానికి నాందీ ఎలా పడుతుందన్న విషయాన్ని పరిశీలిస్తే... 2019 ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ముందస్తు ఎన్నికల మాట ఎప్పుడో సైడైపోగా ఇప్పుడు సాధారణ షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయన్న అంశం దాదాపుగా స్పష్టమైపోయింది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో అదికార పార్టీగా ఉన్న టీఆర్ ఎస్ కూడా గెలుపు మంత్రంపై సమాలోచనలు ప్రారంభించింది. ఇందులో కీలక అంశంగా పరిగణిస్తున్న ఓ కీలక అంశం బాధ్యతలను కేసీఆర్ పూర్తిగా తన కుమారిడికి అప్పగించారట.

ఆ కీలక అంశమేంటన్న విషయానికి వస్తే... వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లపై పోటీ చేసే అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే పార్టీ గెలుస్తుంది? ప‌్రస్తుతం సిట్టింగ్ లుగా ఉన్న వారిలో ఎంతమంది వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు? ఓడేదెవరు? వఆరి ఓటమికి దారి తీసే పరిస్థితులు ఏమిటి? ఓటమి ఛాన్సులుండే నియోజకవర్గాల్లో గెలుపు జెండా ఎగురవేయాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? అభ్యర్థుల మార్పిడి అవసరమయ్యే స్థానాలు ఏమిటి? అభ్యర్థులను మారిస్తే... పార్టీ సమీకరణాలు ఎలా ఉండాలి?  కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి అవకాశాలు ఎలా?  కొత్తవారికి అవకాశమిస్తే... పాత కాపులను ఏం చేయాలి? అసంతృప్తిని చల్లార్చేందుకు ఏం చేయాలి? అసలు అసంతృప్తి బుసలు కొట్టే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి?... తదితర అంశాలన్నింటినీ సమీక్షించే బాధ్యతలను ఇటీవలే కేటీఆర్ స్వీకరించారట. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే కేటీఆర్ ఈ సుదీర్ఘ కసరత్తుకు శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలో ఈ కసరత్తును ప్రారంభించిన కేటీఆర్... తన అధ్యయనాన్ని కాస్తంత లోతుగానే చేస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సిట్టింగ్ లు - పార్టీలో ఆది నుంచి కొనసాగుతూ వస్తున్న నేతలతో పాటు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్తొళ్లు - ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన వారు కూడా కేటీఆర్ వేస్తున్న ప్రతి అడుగును చాలా నిశితంగా పరిశీలిస్తున్నారట. మొత్తంగా ఈ కసరత్తు పార్టీలో నవ శకానికి నాందీ పలకడమే కాకుండా... కేటీఆర్ కే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే దిశగా అవలంబిస్తున్న వ్యూహంగానే పరిశీలకులు భావిస్తున్నారు.