బాబుపై కేటీఆర్ వీడియో వార్!

Thu Nov 15 2018 20:02:22 GMT+0530 (IST)

తెలంగాణ ముందస్తు ఎన్నికలు జోరందుకున్నాయి. నెలన్నర ముందే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులను ప్రకటించి సమరానికి సై అంది. మహాకూటమి పేరులో కలుస్తున్న ప్రతిపక్షాలు గడచిన నాలుగైదు రోజులుగా తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే ఈ ప్రచారంలో ప్రతిపక్ష మహాకూటమి కంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ముందంజలో ఉంది. బహిరంగ సభలు ఇంటింటి ప్రచారం వంటి పాత ప్రచారాలకు తోడు  సాంకేతికతను అంది పుచ్చుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధక్షుడు కె. చంద్రశేఖర రావు ఈ ప్రచార బాధ్యతలను తన కుమారుడు ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావుకు అప్పగించారు.యువకుడైన కేటీఆర్ తన ప్రచార సరళిని సాంకేతికత వైపు మళ్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన ప్రత్యర్దిగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ - ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే లక్ష్యంగా సోషల్ మీడియా వార్‌కు రంగం సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడి రెండు కళ్ల సిద్దాంతంతో పాటు రెండు నాల్కల వైనాన్ని కూడా కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు తన ప్రయత్నాలను ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఇటీవల వారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను కలిపి ఒక వీడియో రూపొందించాలని నిర్ణయించింది.

ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేక పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ప్రకటించారు. ఆ తర్వాత 2014లో బీజేపీతో స్నేహం కుదిరాక ఆ పార్టీని మించిన పార్టీ మరోటి లేదంటూ ప్రకటించారు. వీటికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా అప్పటి వీడియోలున్నాయి. ఆ రెండింటిని ఏకం చేస్తు నాడు బీజేపీ వ్యతిరేకి - నేడు బీజేపీ స్నేహితుడు అన్న పేరుతో సోషల్ మీడియాలో విడుదల చేయాలని తెరాస నిర్ణయించింది. అలాగే ఇటీవల కాలంలో బీజేపీతో చెడిన తర్వాత చంద్రబాబు ఆ పార్టీని తిడుతూ చేసిన వ్యాఖ్యల వీడియోలను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక కొత్త స్నేహితుడు కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు నాయుడు అనేక సార్లు విరుచుకుపడ్డారు. ఆ వీడియోలను నేడు వారితో కలసి పొగుడుతున్న వీడియోలను కూడా ఏక కాలంలో విడుదల చేయాలని నిర్ణయించింది తెరాస. ఈ వీడియోలు కూడా చంద్రబాబు నాయుడిలోని ఊసరవెల్లి రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బహిర్గితం అవుతాయని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిలోని అవసార్ద స్నేహం తెలుగు ప్రజలకు తెలియచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుదలగా ఉంది.