Begin typing your search above and press return to search.

ఇట్లు.. మీ కేటీఆర్!

By:  Tupaki Desk   |   17 Dec 2018 10:54 AM GMT
ఇట్లు.. మీ కేటీఆర్!
X
ఉద్యమ పార్టీగా తెలంగాణ స్వప్నాన్ని నిజం చేసి రాజకీయ పార్టీగా బంగారు తెలంగాణ గమ్యం దిశగా దూసుకెళుతున్న టీఆర్ ఎస్ లో నవనాయకత్వం కొత్త ఉత్సాహాన్ని నింపింది..! తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్న కేటీఆర్.. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు..! ఉద్యమ ప్రస్థానంలో… సంక్షేమ పాలనా పథంలో సీఎం కేసీఆర్ అడుగులో అడుగై నడిచిన కేటీఆర్‌.. పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా రంగంలోకి దిగారు..! ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ తెలంగాణ భవన్ గులాబీమయమైంది..! పార్టీ ముఖ్య నేతలు - వేలాది కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది..!

వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోడానికి బయల్దేరేముందు ప్రగతిభవన్ లో కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ - ఆయన సతీమణి శోభ కుమారుణ్ని ఆశీర్వదించారు. అనంతరం ఎంపీ కవిత సోదరుడి నుదుట తిలకం దిద్దారు. ఎంపీ సంతోష్ కుమార్ కేటీఆర్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు వచ్చే క్రమంలో దారి పొడువునా పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వివిధ కళారూపాలు - బతుకమ్మలు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికాయి. పులి డాన్స్ - శివసత్తుల పూనకాలు - పోతరాజుల ఆటాపాటా ఆకట్టుకున్నాయి. హోరున వీస్తున్న గాలికి పెద్దపెద్ద జెండాలు విన్యాసం చేస్తుంటే ముచ్చటేసింది. ఓపెన్ టాప్ జీప్ లో కేటీఆర్ తెలంగాణ భవన్ కు తరలివస్తుండగా జననీరాజనం హోరెత్తింది. వేలాది కార్యకర్తల జయజయ ధ్వానాల నడుమ కేటీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

జయజయ ధ్వానాలు - డప్పు చప్పుళ్ల నడుమ కేటీఆర్ భారీ ర్యాలీతో తెలంగాణ భవన్కు చేరుకున్నారు. రంగురంగుల రిబ్బన్లు ఆకాశం నుంచి వర్షంలా పడుతుంటే కేటీఆర్‌ ఓపెన్ టాప్ జీప్ దిగి భవన్‌ లోకి అడుగుపెట్టారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి వందనం సమర్పించారు. తర్వాత తెలంగాణ భవన్లో ప్రధాన ద్వారం దగ్గర మహిళా కార్యకర్తలు కేటీఆర్ కు తిలకం దిద్ది స్వాగతం పలికారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన కేటీఆర్.. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాంబర్ లో కేటీఆర్ అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పార్టీ ముఖ్య నేతల సమక్షంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చున్నారు. సరిగ్గా 11 గంటల 56 నిమిషాలకు కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు కేటీఆర్ ను ఆశీర్వదించారు. అనంతరం టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తొలి సంతకం చేశారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు తొలుత ఎమ్మెల్యే హరీశ్ రావు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత హోం మంత్రి మహమూద్ అలీ - మాజీ మంత్రులు - పార్టీ సీనియర్ నేతలు - నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - కార్పొరేషన్ చైర్మెన్లు - ఇతర ముఖ్య నేతలంతా కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. శాలువాలతో సత్కరించారు.

అనంతరం తెలంగాణ భవన్ నుంచి బయటకి వచ్చిన కేటీఆర్‌.. వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన చేసిన తొలి ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీని అజేయశక్తిగా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కేటీఆర్ చెప్పారు. ఈక్రమంలో కార్యకర్తల ఆశీర్వాదం కావాలన్నారు. ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తానన్నారు. వందేళ్లపాటు టీఆర్‌ ఎస్‌ ను ప్రజా సేవలో నిమగ్నమయ్యేలా మార్పులు చేస్తానని కేటీఆర్‌ అన్నారు. సంస్థాగతంగా పటిష్ఠంగా పార్టీ నిర్మాణం చేసి, ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలతో పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీలో ఒకడిగా - సోదరుడిగా అన్ని రంగాల వారికీ అండగా ఉంటానని కేటీఆర్ ప్రామిస్ చేశారు.

కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ భవన్ గులాబీమయమైంది. జయహో కేటీఆర్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కేటీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. జెండాలు - పార్టీ నాయకుల చిత్రపటాల ప్రదర్శనతో ఆ తెలంగాణ భవన్‌ ప్రాంతమంతా గులాబీమయమైంది. డప్పు చప్పుళ్ల మోత - పోతు రాజుల విన్యాసం - బాణసంచా కాల్పులు మధ్య తెలంగాణ భవన్‌ పరిసరాలు దాదాపు నాలుగు గంటలపాటు సందడిగా మారాయి.