Begin typing your search above and press return to search.

కేటీఆర్ కామెంట్... హాట్ న్యూస్ ఏమైనా ఉందా?

By:  Tupaki Desk   |   27 Jun 2019 12:51 PM GMT
కేటీఆర్ కామెంట్... హాట్ న్యూస్ ఏమైనా ఉందా?
X
హరీష్ రావు... తెలంగాణలో హాట్ టాపిక్. ఆయనకు ఎంత క్రేజో ఆయన కేంద్రంగా పుట్టుకువస్తున్న వార్తలే నిదర్శనం. టీఆర్ ఎస్ పార్టీ ఎదుగుదలలో కేసీఆర్ తర్వాత కీలక పాత్ర హరీష్ రావుదే. ముఖ్యంగా గ్రామీణంలో పార్టీ పట్టు పెంచుకుంది హరీష్ వల్లనే. ఎందుకో గాని రెండో సారి గెలిచాక కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టారు. కానీ హరీష్ దీనిపై ఎక్కడా అసంతృప్తి వ్యక్తంచేయలేదు. సరికదా మామ గొప్పవాడు అని అవకాశం వచ్చినపుడల్లా ప్రశంశసలు కురిపిస్తున్నారు.

ఒక్కోసారి కేసీఆర్... హరీష్ పట్ల కాస్తంత దూరంగా ఉన్నా కేటీఆర్ మాత్రం చెణుకులతో బావతో ఎపుడూ ప్రేమగా ఉంటూ కనిపిస్తారు. బహిరంగంగా కలిసిన ప్రతిసారీ నవ్వులు పూయిస్తారు. తాజాగా సచివాలయం ప్రారంభోత్సవంలోనూ అదే సీను కనిపించింది. కేటీఆర్- హరీష్ రావుల మధ్య సరదా సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ మంత్రి పదవుల్లో లేరు. 'బావ.. మళ్లీ కుదరదు.. ఇప్పుడే మన పాత ఛాంబర్స్ చూసుకుందాం రా..' అంటూ కేటీఆర్ హరీష్ రావుతో వ్యాఖ్యానించారు. కేటీఆర్ సెటైర్ కు హరీష్ మొహంపై నవ్వులు పూశాయి. వీరి సంభాషణ వింటున్న టీఆర్ఎస్ నేతలు కూడా వీరి సరదా చూసి నవ్వుకున్నారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఏమైనా హింట్ ఉందా అని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే త్వరలో కేబినెట్ విస్తరణ చేయనున్న నేపథ్యంలో.... చాంబర్లు చూసుకుందాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారంటే... మళ్లీ ఇద్దరికీ మంత్రి పదవి దక్కనుందా అని గుసగుసలు మొదలయ్యాయి.

ఈ సీన్ అనంతరం కేటీఆర్ తో సెల్ఫీల కోసం కొందరు ప్రయత్నించారు. వారితో సెల్ఫీలు దిగుతూ కేటీఆర్, ఇతర నేతలతో మాట్లాడుతూ హరీష్ కాసేపు అక్కడ గడిపి అనంతరం వెళ్లిపోయారు. కొసమెరుపు ఏంటంటే... వీరు నిర్వహించిన శాఖలు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో ఆ గదులు కూడా ఎవరికీ కేటాయించలేదు. ఛాంబర్స్ ఖాళీగానే ఉన్నాయి.