Begin typing your search above and press return to search.

ఆ మీడియా సంస్థ‌ల‌కు కామ‌న్‌సెన్స్ లేదంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   21 Jan 2019 9:10 AM GMT
ఆ మీడియా సంస్థ‌ల‌కు కామ‌న్‌సెన్స్ లేదంటున్న కేటీఆర్‌
X
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌లు మీడియా సంస్థ‌ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు నిజనిజాలు తెలుసుకోకుండా, కామన్ సెన్స్ లేకుండా వార్తలను పబ్లిష్ చేస్తున్నాయని మండిప‌డ్డారు. ఇంతకీ కేటీఆర్ ఆగ్ర‌హం వెనుక కార‌ణం ఏమిటంటే.... గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేస్తున్న యాగంపై వార్త‌ల ప్ర‌సారం చేస్తున్న తీరే.

గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహస్ర చండీ మహాయాగాన్ని ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో యాగాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, సహప్ర చండీ యాగం, రాజ శ్యామల యాగం, చతుర్వేద మహాయాగం, సప్తశతి యాగం, రుద్ర మహాయాగం నిర్వహించనున్నారు. యాగంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహముద్ అలీ, కేటీఆర్ దంపతులు, హరీశ్ రావు దంపతులు, ఎంపీలు కవిత, లక్ష్మీకాంతారావు, కేశవరావు దంపతులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాయాగ క్రతువులు శృంగేరీపీఠం సాంప్రదాయాల ప్రకారం జరగనున్నాయి. ఈ యాగాల్లో 300 మంది రుత్వికులు పాల్గొంటున్నారు.

అయితే, ఈ ఎపిసోడ్‌పై ఓ ఆంగ్ల చానెల్ క‌థనం ప్ర‌చురించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం, ప్రధాని కావాలనే లక్ష్యంతోనే నేటి నుంచి ఐదు రోజుల పాటు సహస్ర చండీ మహాయాగం చేస్తున్నారని ఓ ఇంగ్లీష్ మీడియా వార్త ప్రచురించింది. ఈ వార్తను హర్షవర్ధన్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేస్తూ.. కేసీఆర్ ప్రధాని కోసం యాగాలు చేయడం లేదని.. ఇలాంటి వార్తలు నిరాధారం అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ సంబంధిత ఇంగ్లీష్ మీడియాకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడం పట్ల సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.