బర్త్ డే ఖర్చు వద్దు.. కేటీఆర్ నిర్ణయం

Mon Jul 23 2018 22:47:49 GMT+0530 (IST)

పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించాలనుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి..కానీ తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్ మాత్రం డిఫెరెంట్.. మంగళవారం కేటీఆర్ 42వ పుట్టినరోజు.. కాబోయే సీఎంగా టీఆర్ఎస్ లో పేరున్న కేటీఆర్  బర్త్ డే అంటే ఆ పార్టీ వర్గాలు ఊరుకుంటాయా.? పైగా అధికారంలో ఉండడంతో హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కటౌట్లు హోరెత్తించారు. ఎక్కడ చూసినా కేటీఆర్ చిత్రపటాలే.. దీనిపై తాజాగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను పిలిచి తన బర్త్ డే ఫ్లెక్సీలు - కటౌట్లను తీసివేయించాలని ఆదేశించాడు. అంతేకాదు తన బర్త్ డే వేడుకలకు పెట్టే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని పార్టీ అభిమానులను కేటీఆర్ కోరాడు. కేటీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బొంతు రామ్మోహన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఫెక్సీలు కటౌట్లను    కార్మికులతో కలిసి  తీసి వేయిస్తున్నాడు.

కేటీఆర్ బర్త్ డే అని తెలిసి ఆయన అభిమానులు తాజాగా ఒక పాటను విడుదల చేశారు. కేటీఆర్ బర్త్ డే సాంగ్ ను ఎమ్మెల్సీ శంభీర్ పూర్ రాజు - నగర మేయర్ బొంతు రామ్మోహన్  విడుదల చేశారు. ‘నీలాల మబ్బుల్లో సూర్యుడు.. నువ్వు తెలంగాణ నేల రాముడు’ అంటే సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది.