Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో ‘‘టీఆర్ఎస్’’ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారట

By:  Tupaki Desk   |   7 Feb 2016 3:59 AM GMT
ఆంధ్రాలో ‘‘టీఆర్ఎస్’’ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారట
X
విమర్శలతో వేడెక్కించటం.. ఆరోపణలతో ఆదరగొట్టటం.. చతురతతో చితక్కొట్టేయటం రాజకీయాల్లో మామూలే. కానీ.. చమత్కారాలతో చిరాకు పుట్టించే టాలెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు కాస్త ఎక్కువే. ఈ మాటల మనిషికి అన్నింటితో పాటు హాస్యంగా మాట్లాడుతున్నానంటూనే ప్రత్యర్థిని చక్కిలిగింతలు పెట్టినట్లుగా పెడుతూనే.. ఎక్కడో కెలికేలా మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలాంటి డోస్ ను పెంచుతూ తన రాజకీయ ప్రత్యర్థిపై మైండ్ గేమ్ ఆడటం మొదలైంది. ఒకసారి చేసిన వ్యాఖ్యపై కాసింత రచ్చ అయినా.. అదే మాటను మరోసారి మాట్లాడటం అంత సులువేం కాదు.

కానీ.. దాన్నే కాస్తంత హాస్యాన్ని రంగరించి సమయానుకూలంగా మాట్లాడేసిన తీరు చూస్తే.. కేటీఆర్ పిల్లాడు కాదు.. పిడుగే సుమా అన్నభావన కలగటం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. తమ పార్టీని ఏపీకి విస్తరించాల్సిన పరిస్థితి వస్తుందేమోనని.. సీమాంధ్రలో తమను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందంటూ వ్యాఖ్యలు చేసి మరోసారి తన మాటలు చర్చగా మార్చేశారు. ఆ మధ్య టీఆర్ఎస్ పార్టీకి సరికొత్త అర్థం చెబుతూ.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తన తండ్రి వెళ్లిన సందర్భంగా అక్కడి ప్రజల కేరింతల్ని ప్రస్తావిస్తూ సరదాగా ఈ వ్యాఖ్యలు చేయటం.. దీన్నో ఇష్యూగా తెలంగాణ విపక్షాలు చేయటం తెలిసిందే.

అయితే.. వారి మాటల్ని పూచిక పుల్ల మాదిరిగా తీసేస్తూ.. సరదాగా అనే మాటల్ని ఇంతలా సాగదీస్తారే అంటూ కూల్ గా బదులిచ్చిన కేటీఆర్.. మళ్లీ అలాంటి మాటలే మరోసారి వ్యాఖ్యానించటం గమనార్హం. టీఆర్ ఎస్ ను తెలుగు రాష్ట్రసమితిగా మారుస్తామన్న విషయాన్ని ఏం చేశామంటూ ఓ టీవీ ఛానల్ లో అడిగిన ప్రశ్నకు కూల్ గా బదులిస్తూ.. టీఆర్ఎస్ కు ఏపీలో ఫ్యాన్స్ పెరిగిపోతున్నారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటామని.. తెలంగాణ పిసరంత ఎక్కువ బాగుండాలని కోరుకుంటామన్న కేటీఆర్.. హూధూద్ సమయంలో విశాఖ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదని.. శ్రీశైలం నీరు విడుదల సమయంలోనూ ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదని.. రెండు రాష్ట్రాల తెలుగువారు బాగుండాలన్న వ్యాఖ్య చేసి సీమాంధ్రుల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో తమ పార్టీకి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారంటూ కూల్ బదులిచ్చిన కేటీఆర్ మాటల వైనం చూస్తే.. అవసరం వచ్చినప్పుడు పార్టీల్ని ఆంధ్రా.. తెలంగాణ అంటూ వేరు చేసి దునుమాడే వ్యక్తి.. తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా హాస్యం అంటూనే తన ప్రత్యర్థి పార్టీలకు మంట పుట్టేలా మాట్లాడేయటం గమనార్హం.